నవతెలంగాణ-హైదరాబాద్: త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేఫథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఈసీ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేపట్టడానికి ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ఎన్డీయో కూటమి భాగస్వామి టీడీపీ ఎన్నికల సంఘానికి ఎస్ఐఆర్‌పై ఏడు ప్రతిపాదనలతో కూడిన కీలక లేఖ రాసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రతినిధుల బృందం దిల్లీలో సీఈసీకి వినతిపత్రం అందజేశారు.
ఓటర్ల జాబితా ధ్రువీకరణను బలోపేతం చేయాలని, కాగ్ ఆధ్వర్యంలో ఏడాదికోసారి థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహించి, ఓటర్ల జాబితా రూపొందించడంలో ఏఐ సాయం తీసుకోవాలని లేఖలో పేర్కొంది. ఆధార్ సహాయంతో నకిలీ ఎపిక్ నంబర్లను గుర్తించాలి. ఇంక్ ఆధారిత ధ్రువీకరణ స్థానంలో బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియను అమలు చేయాలని సూచించింది. ఓటర్ల జాబితా సవరణలో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లను భాగస్వాములను చేయాలంది.
డ్రాప్ట్ రోల్స్‌ను ముందస్తుగా బీఎల్‌ఏలతో పంచుకోవడాన్ని తప్పనిసరి చేయాలని, ఓటర్ల చేర్పులు, తొలగింపులకు సంబంధించి జిల్లాల వారీ డేటాను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని, దీనివల్ల పారదర్శకతతో పాటు ప్రజలు సులభంగా చెక్ చేసుకోవచ్చు తెలిపింది. ఓటర్ల జాబితాపై సంప్రదింపులు, పర్యవేక్షణకు ప్రతి నెలా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో జిల్లా, నియోజకవర్గ ఎన్నికల అధికారులు సమావేశాలు నిర్వహించాలి.