నవతెలంగాణ-హైదరాబాద్ : నంద్యాల జిల్లా శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బి. రాజశేఖర రెడ్డి, ఆయన అనుచరులు తమను కిడ్నాప్ చేసి, గంటల తరబడి దాడి చేశారని అటవీ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే, శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని నెక్కంటి ఫారెస్ట్ రేంజ్‌లో పనిచేస్తున్న కొందరు అధికారులు మంగళవారం రాత్రి విధుల్లో ఉన్నారు. పులి హత్యకు సంబంధించిన కేసులో భాగంగా చెక్-పోస్ట్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారని బాధితులు తెలిపారు. ఆ సమయంలో తమపై తీవ్ర స్థాయిలో దూషణలకు దిగారని, “మా ప్రభుత్వమే అధికారంలో ఉంది.. అయినా మా ఆదేశాలు పాటించరా, మాకు సహకరించరా?” అంటూ బెదిరించారని వాపోయారు.
అనంతరం డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్ నాయక్, బీట్ ఆఫీసర్లు గురువయ్య, మోహన్ కుమార్, డ్రైవర్ కరీముల్లాను బలవంతంగా ప్రభుత్వ వాహనంలోకి ఎక్కించుకుని కిడ్నాప్ చేశారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్వయంగా ఎమ్మెల్యేనే వాహనం నడుపుతూ, తెల్లవారుజామున 2 గంటల వరకు ఆ ప్రాంతంలో తిప్పుతూ దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి, శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ దాడికి నిరసనగా సున్నిపెంట, శ్రీశైలం, దొర్నాల, యర్రగొండపాలెం ప్రాంతాల్లో చెంచు గిరిజనులు ఆందోళన చేపట్టారు. అటవీ అధికారుల సంఘం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. బాధితుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారు ఉన్నారని, ఈ విషయాన్ని అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఘటన గురించి సీనియర్ అధికారులతో మాట్లాడి పూర్తి నివేదిక కోరారు. తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది.
మరోవైపు, ఈ ఘటనపై ప్రతిపక్ష వైసీపీ స్పందించింది. టీడీపీ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మద్యం మత్తులో అధికారులపై దాడి చేశారని, గిరిజన సిబ్బందిని వేధించారని ఆరోపించింది. ఇది అధికార పార్టీ నేతల అరాచకాలకు నిదర్శనమని విమర్శించింది.