బీఆర్‌ఎస్ కార్యకర్తల అరెస్టులు ఎందుకు?
సనత్‌నగర్ నుంచే మళ్లీ బోణీ కొడతాం
గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును రెట్టింపు చేయాలి : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-బేగంపేట్
“రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు దండయాత్రకు వెళ్తున్నారు.. దండయాత్ర చేయడానికి సిరిసిల్ల ఏమైనా శత్రు రాజ్యమా? సిరిసిల్ల తెలంగాణలో లేదా?” అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులను సుమారు 4 వేల మందిని పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. ఒక్కసారి సిరిసిల్లలో అడుగుపెట్టి కేటీఆర్‌కు ముందు, కేటీఆర్ తర్వాత జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే అక్కడి ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. బుధవారం హైదరాబాద్ బేగంపేటలోని జొరాస్ట్రియన్ క్లబ్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదును ముమ్మరం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నవరాత్రులు, దసరా తర్వాత ఓటు నమోదు చేద్దామనే ఆలోచన వద్దని, వెంటనే క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. గతంలో సనత్‌నగర్ నుంచే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి వాణీదేవిని గెలిపించుకున్నామని, ఈసారి కూడా సనత్‌నగర్ నుంచే మొదలుపెట్టి మళ్లీ గెలుస్తామని అన్నారు. అప్పుడు సనత్‌నగర్ నియోజకవర్గంలో 10,490 గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేశామని, ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేయాలని తెలిపారు. కార్యకర్తలు సానుకూల దృక్పథంతో ఇంటింటికీ వెళ్లి గ్రాడ్యుయేట్ ఓటర్లను నమోదు చేయించాలని సూచించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు, ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ, డీఏల చెల్లింపు తదితర అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చామని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ఆరోపించారు.
తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలో ఒక్క గ్రాడ్యుయేట్ కూడా మిగలకుండా ఓటరుగా నమోదు చేయించేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. ప్రతి 50 ఇండ్లకు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఓటరు నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. కాలనీలు, బస్తీలు, అపార్ట్‌మెంట్ల వద్ద నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. గత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సుమారు 10 వేల మంది ఓటర్లుగా నమోదయ్యారని, ఈసారి 40 వేల ఓటర్ల నమోదే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్‌యాదవ్, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, టి. మహేశ్వరి, ఆకుల రూప, కిరణ్మయి, అత్తిలి మల్లికార్జున్‌గౌడ్, డివిజన్ అధ్యక్షులు గుర్రం పవన్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)