నవతెలంగాణ-హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ఫారం–6లో చేసిన మార్పులపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఎన్నికల సంఘం (ఈసీ)ని నిలదీశారు. ఓటరు నమోదు కోసం ఉపయోగించే ఫారం–6లో మార్పులు చేయాలని ఎవరు ఆదేశించారు? వాటిని ఎవరు ఆమోదించారు? అని ఆయన గురువారం సోషల్‌మీడియా ఎక్స్‌లో ప్రశ్నించారు. “ఆన్‌లైన్ ఫారం–6ను చట్టవిరుద్ధంగా మార్చారు. ఈ మార్పు చేయాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)ను ఈసిఐలో ఎవరు ఆదేశించారు? టిసిఎస్‌లో దానిపై ఎవరు సంతకం చేశారు? అందుకు వారిపై ఏమైనా ఒత్తిడి తెచ్చారా?” అని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు.
ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు ఉపయోగించే ఆన్‌లైన్ ఫారం–6లో చేసిన మార్పులపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఇటీవల వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం, ఈసిఐనెట్ పోర్టల్‌లోని ఆన్‌లైన్ ఫారం–6లో అదనంగా ఒక డిక్లరేషన్ భాగాన్ని చేర్చారు. ఇందులో దరఖాస్తుదారు పేరు, వారి తల్లిదండ్రులు లేదా తాత, అమ్మమ్మల పేర్లు చివరిసారిగా జరిగిన ఎస్‌ఐఆర్ సమయంలోని ఓటర్ల జాబితాలో ఉన్నాయా అనే వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మార్పుపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసి, దీనిని అనధికారికమైనదిగా పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది.







కామెంట్‌లు (0)