నవతెలంగాణ – తుంగతుర్తి
సమాజంలో విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ నియోజకవర్గాన్ని విద్యా రంగంలో అగ్రభాగాన నిలపడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేలు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనందున అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్ని మరింత పెంచాలని సూచించారు. మండల స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన 13 మంది ఉపాధ్యాయులకు శాలువాలు, జ్ఞాపికలను బహూకరించి ఘనంగా సన్మానించారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలతో పోలిస్తే,ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు ఎంతో మెరుగైన బోధనా సామర్ధ్యం , నైపుణ్యాలు కలిగి ఉన్నారని అన్నారు. వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ప్రభుత్వ పాఠశాలలలో చదివే పేద కుటుంబాల పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే బృహత్ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మ ఆదర్శ పాటశాల కమిటీల ద్వారా కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారని తెలిపారు. మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర బడ్జెట్లో 10 శాతం వరకు నిధులు రూ.22 వేల కోట్లను విద్యా రంగానికి కేటాయించారని గుర్తు చేశారు. దీనిని గుర్తించిన అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడులలలో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారని,అన్ని పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు.
ప్రభుత్వ బడులలో ఆంగ్ల మాధ్యమ బోధనతో పాటు ప్రీ-స్కూల్స్ ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు.మార్కులు,ర్యాంకుల ప్రాతిపదికన కాకుండా దేశానికి భావిభారత పౌరులను అందించే సంకల్పంతో విద్యార్థులకు ఆయా సబ్జెక్టులతో పాటు నైతిక విలువలు,క్రమశిక్షణ,ధ్యానం,యోగా వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.సులభంగా విద్యార్థులు అర్థం చేసుకునే రీతిలో ఆధునిక పద్ధతుల్లో బోధన చేయాలని హితవు పలికారు.సమాజ ప్రగతి,నడవడిక ఉపాధ్యాయుల పైనే ఆధారపడి ఉంటుందని,దీనిని గుర్తెరిగి ప్రతి ఉపాధ్యాయుడు తమ విధులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని అన్నారు.విద్యా రంగం పనితీరు ఎంతో సంతృప్తికరంగా ఉందని,ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ బడులు పోటీ పడుతున్నాయని ప్రశంసించారు.ప్రైవేట్ తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో,క్రీడా మైదానాలు, సరిపడా తరగతి గదులు,ఆహ్లాదకర వాతావరణం, అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు.
ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ,విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తూ,వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని హితవు పలికారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులపై,చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ,ట్రిపుల్ ఐ.టీ,ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ప్రవేశాలు పొందేలా వారిని ప్రోత్సహించాలని అన్నారు.ప్రతి ఒక్కరికి విద్య ఎంతో అవసరమని,అందుకే ప్రభుత్వం విద్యా హక్కుకు చట్టబద్ధత కల్పించిందని గుర్తు చేశారు.విద్యారంగంతోనే సమాజ ప్రగతి,అన్ని రంగాల అభివృద్ధి ఆధారపడి ఉంటాయని అన్నారు.దీనిని గుర్తిస్తూ,విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని,బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.మారుతున్న సామాజిక పరిస్థితులు,అధునాతన శాస్త్ర,సాంకేతికతకు అనుగుణంగా సరికొత్త పద్ధతుల్లో విద్యను బోధించేలా ఉపాధ్యాయులు కూడా ఎప్పటికప్పుడు నిత్య విద్యార్ధిగా కృషి చేయాలని అన్నారు.
మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు జి.ఉషారాణి గెజిటెడ్ హెడ్మాస్టర్ వెలుగుపల్లి,ఎన్.విగ్నేశ్వరి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ తుంగతుర్తి బాలికల పాఠశాల,కె.సుజాత స్కూల్ అసిస్టెంట్ తెలుగు బండరామారం,ఎ.నరేందర్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అన్నారం,కె.కల్పన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వెలుగుపల్లి,పి. కార్తీక్ రెడ్డి పిడి అన్నారం,కె.వెంకట్ రెడ్డి ఎల్ ఎఫ్ ఎల్ హెడ్మాస్టర్ గొట్టిపర్తి,కె. సునీత ఎస్జిటి అన్నారం,ఎం.డి ఆస్రా ఫర్వీన్ ఎస్ జి టి కరివిరాల,ఎం.నాగేశ్వరి ఎస్జీటీ కరివిరాల,టి.వెంకట్రాములు ఎస్ జి టి బండరామారం,బి.ఉమారాణి ఎస్జీటీ బండరామారం,బి.ధనలక్ష్మి ఎస్ జి టి తూర్పుగూడెం. ఈ కార్యక్రమంలో బీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు మండల విద్యాశాఖ అధికారి బోయిని లింగయ్య తాసిల్దార్ దయానందం వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.