– బేస్ క్యాంపు పరిసరాల్లో మద్యం బాటిల్లు
– బేస్ క్యాంప్ వెనుక చెట్ల నరికివేత
– అధికారుల మౌనమే అండా..?
– చెట్ల నరికివేత పై విచారణ 
నవతెలంగాణ-రాయికల్
జగిత్యాల జిల్లా రూరల్ పరిధిలోని అల్లీపూర్ ఈస్ట్,వేస్ట్,నగునూరు,రేచపల్లి, రంగంపేట బేస్ క్యాంప్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాలు ఇప్పుడు టేకు మాఫియాల కేంద్రముగా మారాయి. అల్లీపూర్ సెక్షన్ బేస్ క్యాంప్ పక్కనే, కూతవేటు దూరంలోనే చెట్ల నరికివేత సాగుతుండడం స్థానికులను షాక్‌కు గురి చేస్తోంది.ప్రజల వాకిలిలోని చెట్లను కాపాడలేకపోయిన అధికారులు,అడవిలో జరుగుతున్న ఈ దోపిడీని గమనించలేదా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అటవీ అధికారులు ఉన్నా లేకున్నా తేడా లేదు.చెట్ల దుంగలు,ఎడ్లబండి, ట్రాక్టర్లలో ఎక్కించి తీసుకెళ్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  
-బేస్ క్యాంప్ పరిసరాల్లో బీరు,విస్కీ బాటిల్లు
 బేస్ క్యాంప్ పరిసరాల్లో మద్యం బాటిల్లు పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది.దుండగులు స్థానిక అధికారులతో రాత్రివేళల్లో మద్యం మత్తులో జల్సాలు చేసుకుంటూ, ఉదయానికల్లా చెట్లను నరికి తరలిస్తారని స్థానికుల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
-చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న అటవీశాఖ
టేకు దోపిడీ వార్తలు బయటకు వచ్చిన తర్వాతే అటవీ అధికారులు కదిలారు.ఎస్సారెస్పీ కెనాల్ దారిలో కందకాలు తవ్వి వాహనాల రాకపోకలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు.కానీ ఇది “తరువాత పశ్చాత్తాపం” చర్యగా విమర్శలు వస్తున్నాయి.
-అధికారి,దుండగుల కుమ్మక్కు..?
తినే కంచంలో రాయి వేసిన చందంగా ఉందంట ఆ అధికారి ప్రవర్తన.సమాచారం ప్రకారం అల్లీపూర్ సెక్షన్ పరిధిలో పనిచేస్తున్న ఓ అధికారి,కొంతమంది చెట్ల మాఫియాలతో కుమ్మక్కై టేకు చెట్ల నరికివేతకు సౌకర్యం కల్పిస్తున్నారట.అక్రమంగా నరికిన టేకు చెట్లతో తలుపులు, కిటికీలు,దర్వాజాలు తయారు చేసి అక్రమంగా అమ్మకాల ద్వారా లాభాలు దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
-ఆలస్యంగా ఉన్నతాధికారుల మేల్కొలుపు 
ఆ నోటా…ఈ నోటా విషయం బహిర్గతం కావడంతో ఉన్నతాధికారులు చివరికి విచారణ ప్రారంభించారు.కానీ లోపలివాళ్లు బయటకు వచ్చే ముందు ఆధారాలను చెరిపివేయడం ప్రారంభించారని, ఎక్కువ సంఖ్యలో చెట్లు నరికివేతకు గురైతే తక్కువ సంఖ్యను మాత్రమే చెపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.బేస్ క్యాంప్ పక్కనే చెట్ల నరికివేత ఎవరి అనుమతితో..?చెట్ల లెక్కలు ఎవరు చెక్ చేస్తున్నారు..?ప్రతి నెల రిపోర్టులు తయారు చేసే అధికారులు ఎక్కడున్నారు..? ప్రకృతిని రక్షించే వారు దానిని దోచుకుంటే…అటవీ రక్షణ ఎవరిపై నమ్మాలి..? అటవీప్రాంతం పచ్చగా ఉండాలంటే,మౌనం కాదు చర్య అవసరమని ప్రకృతి ప్రేమికులు వాపోతున్నారు.
-అటవీ ప్రాంతాలు పర్యావరణ సమతుల్యతకు ప్రాణాధారం
అయితే అవే ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం,దుండగుల దురాశకు బలి అవుతున్నాయి.ప్రకృతి సంపద రక్షణలో నిర్లక్ష్యం అంటే భవిష్యత్తుకు ప్రమాద సంకేతం.ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే,ఈ రోజు టేకు చెట్లు రేపు మొత్తం అడవి మాయమవుతుందన్నది వాస్తవం.

                                    

