నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీలంక వేదికగా జరిగిన మహిళల ముక్కోణపు వన్డే టోర్నమెంట్‌లో భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం (ఆర్‌పీఎస్)లో జరిగిన ఫైనల్ పోరులో, ఆతిథ్య శ్రీలంక జట్టుపై 97 పరుగుల భారీ తేడాతో టీమిండియా అద్భుత విజయం సాధించి, సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ కీలకమైన తుది సమరంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచింది. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ స్మృతి మందాన మరోసారి తన క్లాస్ ఆటతీరుతో అదరగొట్టింది. ఆమె కేవలం 101 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేసి అద్భుతమైన శతకాన్ని నమోదు చేసింది. మందానకు తోడుగా హర్లీన్ డియోల్ (47), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగ్స్ (44) తమ వంతు కీలక పరుగులు చేశారు. చివరి ఓవర్లలో దీప్తి శర్మ (20 నాటౌట్) వేగంగా ఆడి జట్టు స్కోరును 340 పరుగులు దాటించడంలో తోడ్పడింది. శ్రీలంక బౌలర్లలో మాల్కీ మడారా, దెవ్మి విహంగా, సుగంధిక కుమారి తలో రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. అనంతరం, 343 పరుగుల కఠిన లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు, భారత బౌలర్ల సమష్టి దాడికి తట్టుకోలేకపోయింది. లంక జట్టు 48.2 ఓవర్లలో 245 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో కెప్టెన్ చమారి అథపత్లు (51 పరుగులు), నీలక్షిక సిల్వా (48 పరుగులు) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేసి, కొంత ప్రతిఘటన కనబరిచారు. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. భారత బౌలింగ్ విభాగంలో స్నేహ రానా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆమె 9.2 ఓవర్లు బౌలింగ్ చేసి, కేవలం 38 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టింది. అమన్‌జోత్ కౌర్ మూడు వికెట్లతో రాణించగా, శ్రీ చరణి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సమగ్ర ప్రదర్శనతో భారత మహిళల జట్టు ట్రై సిరీస్‌ను ఘనంగా కైవసం చేసుకుంది.
ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మందాన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకు ఎంపికైంది. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన స్నేహ రాణా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారాన్ని దక్కించుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేయడం ద్వారా, వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో స్మృతి మందాన మూడో స్థానానికి చేరుకుని ఓ రికార్డును కూడా తన పేరిట లిఖించుకుంది.