నవతెలంగాణ- హైదరాబాద్ : ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌నంటూ పుణె యూనివర్సిటీని బురిడీ కొట్టించిన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇస్తామంటూ నమ్మించి రూ.కోట్లు కాజేసిన అతడు తెలంగాణకు చెందిన ఇంజినీర్ అని వెల్లడించారు.
జులై 25-ఆగస్టు 26 మధ్య జరిగిన సైబర్ మోసం గురించి తాజాగా పోలీసులు వెల్లడించారు. పుణె యూనివర్సిటీకి చెందిన ప్రధాన అధికారికి ఆ సమయంలో ఓ ఫోన్ వచ్చింది. తాను ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌నంటూ సైబర్ నేరగాడు ఆ అధికారితో పరిచయం చేసుకున్నాడు. రూ.28 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు మీ విశ్వవిద్యాలయానికి ఇస్తామంటూ నమ్మించాడు. కాకపోతే.. ఆ ప్రాజెక్టుల కోసం అడ్వాన్స్‌గా కొంత సొమ్ము చెల్లించాలని మభ్యపెట్టాడు. తొలుత రూ.56 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. ఇలాగే పలుమార్లు ప్రాజెక్ట్‌ల పేరు చెప్పి రూ.2.46 కోట్లు కాజేశాడు. ఒప్పందం చేసుకునేందుకు వస్తామంటూ మాయమాటలు కూడా చెప్పాడు. తీరా ఎవరూ రాకపోయేసరికి వారు ఐఐటీ ప్రొఫెసర్‌ను సంప్రదించగా తాను ఎలాంటి ప్రాజెక్టు ఒప్పందాలు చేసుకోలేదని పేర్కొన్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన యూనివర్సిటీ అధికారులు పోలీసులను ఆశ్రయించారు.
ఈ కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులు అతడి పేరు కిలారు సీతయ్యగా గుర్తించారు (Accused Posed as IIT Bombay Professor). హైదరాబాద్ నివాసి అని చెప్పారు. ఈ మోసం కేసులో అతడే ప్రధాన సూత్రధారి అని, సెప్టెంబర్ 21న అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అతడు.. యూకేకు చెందిన విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందాడు. 2019-20లో తాను యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ పాసైనట్లు విచారణలో వెల్లడించాడు. ప్రస్తుతం కోర్టు అతడిని పోలీసు కస్టడీకి అప్పగించింది.