Thursday, May 1, 2025
Homeతాజా వార్తలుతెలంగాణలో విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్‌లకు కీలక పదవులు

తెలంగాణలో విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్‌లకు కీలక పదవులు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలువురు విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ఎస్. శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన శ్రీనివాసరాజు గతంలో సుదీర్ఘకాలంపాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈవోగా బాధ్యతలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా పదవీ విరమణ చేసిన శాంతి కుమారికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) వైస్ చైర్‌పర్సన్‌గా నియమించింది. అంతేకాకుండా, ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించింది. శాంతి కుమారి స్థానంలో కె. రామకృష్ణారావు సీఎస్‌గా నియమితులైన విషయం తెలిసిందే.
బుధవారం పదవీ విరమణ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వి.బి. కమలాసన్ రెడ్డిని రాష్ట్ర నిఘా భద్రత విభాగం ప్రత్యేకాధికారి (ఓఎస్‌డీ)గా పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను ఆయనకు ప్రభుత్వం అప్పగించింది.
ఇంతకుముందు ఆయన రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్‌గా, ఆబ్కారీ శాఖ సంచాలకుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన స్థానంలో సీఎం కార్యాలయ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసీంను ప్రభుత్వం నియమించింది.
ఇటీవల సీజీజీ డీజీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రత్యేక సీఎస్‌గా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img