Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఉపరాష్ట్రపతి రేసులో తెలంగాణ బిడ్డ

ఉపరాష్ట్రపతి రేసులో తెలంగాణ బిడ్డ

- Advertisement -

– ఇండియా బ్లాక్‌ అభ్యర్థిగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి
– 21న నామినేషన్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ తరపున ఉప రాష్ట్రపతి రేసులో తెలంగాణ బిడ్డ జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి బరిలో నిలిచారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి పేరును ప్రకటించారు. ఈ నిర్ణయానికి ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు తెలిపారు. మంగళవారం నాడిక్కడ రాజాజీ మార్గ్‌లోని ఖర్గే నివాసంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఇండియా బ్లాక్‌ నేతలు చర్చించారు. ఈ సమావేశానికి ఎంఏ బేబీ, శరద్‌ పవార్‌, సంజరు రౌత్‌, కెసి వేణుగోపాల్‌, జైరాం రమేష్‌, డెరెక్‌ ఓ’బ్రియన్‌, కనిమొళి, తిరుచ్చి శివ, జాన్‌ బ్రిట్టాస్‌, ధర్మేంద్ర యాదవ్‌, ప్రమోద్‌ తివారీ, రజనీ పాటిల్‌, అరవింద్‌ సావంత్‌ వంటి ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. అనంతరం జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా అంగీకరించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఈ నిర్ణయంతో సహకరిస్తోందని నేతలు వెల్లడించారు.

వ్యూహాత్మక అడుగు
అధికార పక్షానికి ఎదురు నిలిచిన ప్రతి పక్షాలు ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేశాయి. పలు రాష్ట్రాలకు చెందిన వారి పేర్లు పరిశీలనలోకి తీసుకు న్నాయి. అయితే…
ఉపరాష్ట్రపతితో పాటు రాజ్యసభ చైర్మెన్‌గా వ్యవహరించే ఈ పదవి కోసం న్యాయశాస్త్రంపై పట్టు, సుదీర్ఘ అనుభవం కలిగిన జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి వైపు అన్ని పార్టీల నేతలు మొగ్గు చూపారు. అలాగే ఇప్పటికే అధికార ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌ పేరును ప్రకటించినందున, తమ అభ్యర్థిని కూడా దక్షిణాది నుంచి ఎంపిక చేసి వ్యూహాత్మకంగా వ్యవహ రించాయి. ఆ క్రమంలోనే జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి పేరును ఇండియా బ్లాక్‌ అనూహ్యంగా ప్రకటించింది. దీంతో ఇప్పుడు పోటీ న్యాయవేత్త సుదర్శన్‌ రెడ్డి, సీపీ రాధాకృష్ణన్‌ మధ్య ఆసక్తికరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. న్యాయరంగంలో పేరు, ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తిని బరిలోకి దించడంతో ఇండియా బ్లాక్‌ ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేసినట్టు అభివర్ణిస్తున్నారు. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఎన్డీఏ కూటమి చేసిన ప్రయత్నాలకు చెక్‌ పడింది.

కుల సర్వే నిపుణుల కమిటీ చైర్మెన్‌గా
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే-2024 (ఎస్‌ఈఈఈపిసి) డేటా విశ్లేషణ కోసం 11 మంది సభ్యులతో కూడిన స్వతంత్ర నిపుణుల వర్కింగ్‌ కమిటీని వేసింది. ఈ నిపుణుల కమిటీకి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి చైర్మెన్‌గా వ్యవహరించారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు (బీసీ) 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేయడానికి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టే ఆధారంగా మారింది. అంతలా సామాజిక న్యాయంపై విస్తృతమైన అవగాహన కలిగిన వ్యక్తిగా జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి మంచి పేరుంది.

సామాజిక న్యాయం కోసం పోరాడే యోధుడు…ః ఖర్గే
దేశంలోని అత్యంత విశిష్టమైన, ప్రగతిశీల న్యాయనిపుణులలో జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ఒకరని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. న్యాయవాదిగా వివిధ హౌదాల్లో సుదీర్ఘ కాలం దేశానికి సేవలందించారని కొనియాడారు. అలాగే ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడని చెప్పారు. ఉప రాష్ట్రపతిగా జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి పేరు ప్రకటించిన తరువాత ఖర్గే మాట్లాడుతూ ”ఈ ఉపరాష్ట్రపతి పోటీ ఒక సైద్ధాంతిక పోరాటం. దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఎంతగానో తీర్చిదిద్దిన, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఆధారపడిన విలువలను ఆయన పూర్తిగా ప్రతిబింబించారు. అందుకే ప్రతిపక్ష పార్టీలు బి. సుదర్శన్‌ రెడ్డిని తమ ఉమ్మడి అభ్యర్థిగా నామినేట్‌ చేశాయి” అని అన్నారు.

జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ప్రస్థానం
జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి అసలు పేరు బాలకృష్ణ సుదర్శన్‌ రెడ్డి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంలో వ్యవసాయ కుటుంబంలో 1946 జులై 8న జన్మించారు. 1971లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. అదే ఏడాది ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా చేరారు. 1988 ఆగస్టు8న హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితుల య్యారు. 1990 వరకు భారత ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలందించారు. 1993లో ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి న్యాయ సలహాదారుగా కూడా సేవలందించారు
.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 1993 మే2న న్యాయమూర్తిగా జస్టిస్‌ సు దర్శన్‌రెడ్డి నియమితులయ్యారు. 2005 డిసెంబర్‌ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అక్కడి నుంచి 2007 జనవరి12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. దాదాపు నాలుగేండ్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి 2011 జులై 7న పదవీ విరమణ చేశారు. 2013లో లోక్‌పాల్‌, లోకాయుక్తల చట్టం ఆమోదించబడిన తరువాత, 2013 మార్చిలో గోవాకు మొదటి లోకాయుక్తగా సేవలందించారు. అదే ఏడాది అక్టోబర్‌లో వ్యక్తిగత కారణాలతో జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి చట్టపరమైన, పౌర వ్యవహారాల్లో చురుకుగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఆర్బిటరేషన్‌ అండ్‌ మెడిటేషన్‌ సెంటర్‌ బోర్డులో ట్రస్టీగా ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad