– కొందరు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు
– ఉద్యోగులు సంయమనంతో ఉన్నారు
– ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
– ప్రభుత్వ సహకారంతో పెండింగ్ అంశాలను పరిష్కరిస్తాం : టీజీఎస్‌ఆర్టీసీ ఎంప్లారు వెల్పేర్ బోర్డు సమావేశంలో ఎమ్‌డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్ అంశాలను దశల వారీగా పరిష్కరిస్తామని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్పష్టంచేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని టీజీఎస్‌ఆర్టీసీ కళాభవన్‌లో రాష్ట్రస్థాయి ఎంప్లారు వెల్పేర్ బోర్డు సభ్యులతో మంగళవారంనాడాయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వెల్పేర్ బోర్డు సభ్యుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థలో ఒకప్పటి ఆర్థిక పరిస్థితులు, ఇప్పుటి కార్మికుల స్థితిగతులు, యాజమాన్యం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. విధి నిర్వహణలో మరణించిన 2,350 మంది సిబ్బంది కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించామనీ, మెడికల్ అన్‌ఫిట్ అయిన మరో 537 మందికి కూడా ఉద్యోగాలిచ్చామన్నారు.
మహాలక్ష్మి పథకం అమలుతో సిబ్బందిలో పెరిగిన పనిభారాన్ని తగ్గించేందుకు తాత్కాలికంగా డ్రైవర్, కండక్టర్ పోస్టులకు నియామకాలు చేపడుతున్నామనీ, దీనిపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సంస్థలో 3,036 రెగ్యూలర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనీ, సాంకేతిక కారణాలవల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతున్నదని వివరించారు. తమ మనుగడ కోసం ఐదారు నెలలుగా కొందరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నా, ఉద్యోగులు ఎంతో సమయమ నంతో ఉన్నారని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ కొనుగోలు చేసేలా అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. యాజమాన్యం తీసుకునే నిర్ణయాల వెనుక ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాలు ఉంటాయో తప్ప ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేశారు. అన్ని నిర్ణయాలు పారదర్శకంగా, సంస్థ నియమ నిబంధనలకు లోబడే ఉంటాయన్నారు. యాజమాన్యానికి, సిబ్బందికి వెల్పేర్ బోర్డు సభ్యులు అనుసంధాన కర్తల్లాగా పనిచేయాలని సూచించారు. ప్రతి సమస్యను పై అధికారుల దృష్టికి స్వేచ్ఛగా తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, ఖుష్రోషా ఖాన్, సొలోమన్, వెంకన్న, రాజశేఖర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప తదితరులు పాల్గొన్నారు.
పనిభారాలు తగ్గించేందుకే తాత్కాలిక నియామకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES