Wednesday, May 14, 2025
Homeరాష్ట్రీయంఉద్యమ కార్యాచరణ తాత్కాలిక వాయిదా

ఉద్యమ కార్యాచరణ తాత్కాలిక వాయిదా

- Advertisement -

– ప్రభుత్వ చర్యల ఆధారంగా మా నిర్ణయం
– సమస్యలు పరిష్కరించకుంటే జూన్‌ 9న మహాధర్నా
– నేడు అధికారుల కమిటీతో సమావేశం : ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌
– ప్రభుత్వం ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టొద్దు : మాజీ నాయకులకు సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఉద్యోగుల జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా పడింది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఆధారంగా తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుందని ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఉద్యోగ జేఏసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌ మాట్లాడుతూ తమకు దేశ రక్షణే ముందు తర్వాతే ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టడానికి ఈ దేశానికి, సైనికులకు మద్దతు ఇస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడ్డంలో 1967 నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు ముందువరుసలో ఉన్నామని వివరించారు. ఉద్యోగుల హక్కులు, రాయితీలను నిరంతరం పోరాటాలు చేసి సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అధికారుల కమిటీని నియమించినందుకు ఈనెల 15న భోజన విరామ సమయంలో నిర్వహించతలపెట్టిన నిరసన కార్యక్రమాలను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ చర్యలు, స్పందనను బట్టి వచ్చేనెల తొమ్మిదో తేదీన చలో హైదరాబాద్‌ మహాధర్నా కార్యక్రమం ఆధారపడి ఉంటుందని చెప్పారు. సమస్యలను పరిష్కరిస్తే నిర్వహించబోమనీ, పరిష్కరించకుంటే పెద్దఎత్తున నిర్వహిస్తామని అన్నారు. ఆర్థికపరమైనవి, ఆర్థికేతర సమస్యలున్నాయనీ, వాటిని విభజించి పరిష్కరించాలని కోరారు. అధికారుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ముందు ఉద్యోగ జేఏసీతో సమావేశం నిర్వహిస్తుందన్నారు. బుధవారం అధికారుల కమిటీతో సమావేశం ఉంటుందని వివరించారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలలుగా ఉద్యోగులు సహకరిస్తూనే ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని సంయమనం పాటించామనీ, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఎం ఒత్తిడి చేసినా స్పందన కనిపించలేదని అన్నారు. 57 సమస్యలపై అధికారుల కమిటీకి విన్నవించామని చెప్పారు. ఆర్థికేతర సమస్యలు 47 ఉన్నాయనీ, వాటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు. ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు రూ.పది వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఐదు డీఏలను వెంటనే ప్రకటించాలని అన్నారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 51 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయాలని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)ను అమలు చేయాలని అన్నారు. 317 జీవో బాధితుల బదిలీల కోసం సూపర్‌ న్యూమరరీ పోస్టులను సృష్టించి వీలైనంత త్వరగా స్థానికత కోల్పోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులను తిరిగి సొంత జిల్లా/జోన్‌లకు కేటాయించాలని కోరారు. ఈనెల 15న తలపెట్టిన నిరసన ప్రదర్శనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామనీ, తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. కమిటీలతో కాలయాపన చేయకుండా ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల సాధారణ బదిలీలను చేపట్టాలని కోరారు.
గత ప్రభుత్వంలోనే మూడు డీఏలు పెండింగ్‌ : ఏలూరి శ్రీనివాసరావు
గత ప్రభుత్వ హయాంలోనే ఉద్యోగులకు సంబంధించి మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వంలోనే ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు సుమారు రూ.6,500 కోట్లు ఉన్నాయని వివరించారు. మాజీ ఉద్యోగ సంఘాల నాయకులు ఎంప్లాయీస్‌ కోఆర్డినేషన్‌ కమిటీ పేరు మీద ప్రెస్‌మీట్‌ పెట్టారని గుర్తు చేశారు. వారంతా గత ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారనీ, ఉన్నత పదవులను అనుభవించారని చెప్పారు. ప్రభుత్వం ముందు ఉద్యోగులను దోషులుగా నిలబెట్టొద్దని కోరారు. కానీ ప్రభుత్వానికి, ఉద్యోగ జేఏసీ మధ్య చిచ్చు పెట్టేలాగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఈ జేఏసీకి సమస్యల సాధన ఒక్కటే ఏకైక లక్ష్యమని అన్నారు. తమకు రాజకీయ పార్టీలతో అనుబంధంగా ఉండడం లేదనీ, పదవులను ఆశించడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నేతలు ఎ వెంకట్‌, ముజీబ్‌ హుస్సేనీ, ఎ సత్యనారాయణ, పుల్గం దామోదర్‌రెడ్డి, జి సదానందంగౌడ్‌, వంగ రవీందర్‌రెడ్డి, బి శ్యామ్‌, కటకం రమేష్‌, టి లింగారెడ్డి, కస్తూరి వెంకటేశ్వర్లు, ఎన్‌ తిరుపతి, ఎండీ అబ్దుల్లా, జ్ఞానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -