Monday, November 24, 2025
E-PAPER
Homeమానవిగృహిణిల్లో టెన్నిస్ ఎల్బో నియంత్ర‌ణ సాధ్య‌మే

గృహిణిల్లో టెన్నిస్ ఎల్బో నియంత్ర‌ణ సాధ్య‌మే

- Advertisement -

టెన్నిస్‌ ఎల్బో అంటే ఏమిటి? టి ఎల్బో లేదా పార్శ్వ ఎపికోండిలైటిస్‌. పేరుకి ఎల్బో కానీ సమస్య మొదలయ్యేది మణికట్టులో. టెన్నిస్‌ రాకెట్‌తో ఆడే క్రీడల్లో పదే పదే మణికట్టుని తిప్పుతుండడం వలన కండరాల్లో త్వరితగతిలో సంకోచ-విస్తరణలు జరుగుతాయి. అటువంటప్పుడు ముంజేతి కండరాలను, మోచేతి ఎముకకు కలిపే స్నాయువు మీద ఒత్తిడి పెరిగి, గాయానికి గురవ్వడం వలన ఈ స్థితి ఏర్పడుతుంది. మోచేయి కదిపినప్పుడు, మోచేతి బయటి భాగంలో ముట్టుకుంటే సున్నితత్వంతో మొదలయ్యి, కదిపితే విపరీతమైన నొప్పిని కలిగించే బాధాకరమైన పరిస్థితి ఇది.
సాధారణంగా టెన్నిస్‌, బాడ్మింటన్‌ క్రికెట్‌, స్క్వాష్‌ ఆటగాళ్లలో వచ్చే రుగ్మత ఇది. క్రీడలతో సంబంధం కలిగిన సమస్య అయినప్పటికీ టైపింగ్‌, పెయింటింగ్‌ వంటివి నిరంతరం చేసే వాళ్లకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. మోచేతిలో దృఢత్వం సన్నగిల్లుతుంది. పట్టు బలహీనమై, కరచాలనం చేయడం/ వస్తువులను ఎత్తడం/ మణికట్టు లేదా ముంజేయి కదలికలతో కూడుకున్న వస్తువులను తిప్పడం లేదా ఎత్తడం వంటి పనులను చేయడం కష్టతరం అవుతుంది. ఇలాంటి లక్షణాలు ఉదయం లేవగానే/ విశ్రాంతి తర్వాత ఎక్కువగా ఉంటాయి.


గృహిణిల్లో సమస్యకి కారణాలు

నిరంతరం పనులు చేసే గృహిణిలలో కూడా ఈ సమస్య వస్తుంది. గంటల తరబడి వంట చేయడం, పిండి కలపడం, రుబ్బు రోలు ఉపయోగించడం వంటివి మోచేతి కండరాలపై ఒత్తిడి పెంచుతాయి. అలాగే నీరు తోడటం, బరువుగా ఉండే నీటి బకెట్లను పదేపదే ఎత్తడం, బట్టలు పిండడం, ఇల్లు శుభ్రం చేయడం, బ్రష్‌తో నేల రుద్దడం, తోటపని వంటివి ఎక్కువగా చేయడం, వస్తువులు ఎత్తడం, బరువుగా ఉండే పాత్రలు లేదా ఇతర వస్తువులను ఒకే చేత్తో పదేపదే ఎత్తడం వంటి పనులు పల్లె పట్నం తేడా లేకుండా, ముఖ్యంగా సనాతనం, సంప్రదాయం ఎక్కువగా పాటించే ఇళ్లల్లోని మహిళలు ఇప్పటికీ చేసుకుంటూనే ఉంటారు. విశ్రాంతి లేకుండా ఈ విధంగా పనులు చేస్తూపోతే ఈ రకమైన సమస్య వారిలో తలెత్తవచ్చు.

లక్షణాలు?
మోచేతి బయటి భాగంలో నొప్పి ఉంటుంది. నొప్పి ముంజేయి మణికట్టు వరకు వ్యాపించవచ్చు. ఏదైనా వస్తువును పట్టుకున్నప్పుడు లేదా డోర్‌ నాబ్‌ తిప్పినప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. చేతి పట్టు (గ్రిప్‌) బలహీనపడటం, మోచేతి కీలు వద్ద వాపు, మణికట్టు కదిలించినప్పుడు కూడా నొప్పి ఉంటుంది. అశ్రద్ధ చేస్తే రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే నిరంతర దీర్ఘకాలిక నొప్పికి ఇది దారి తీయవచ్చు. పట్టు పూర్తిగా సడలిపోయి, కదలిక పరిమితమయ్యి, వస్తువులను పట్టుకోవడమే కష్టమవచ్చు. స్నాయువుకు దీర్ఘకాలిక నష్టం కలిగి చేతిని అసలు ఉపయోగించలేని పరిస్థితి ఉత్పన్నమవచ్చు. దాంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది.

ఎలా నిరోధించాలి?
జీవనశైలి/ పనితీరులో మార్పులు చేసుకోవాలి. చేతులు, మణికట్టును సాగదీయడానికి తరచుగా విరామం తీసుకోవాలి. బరువులు ఎత్తడం వంటి పనులు నిరంతరాయంగా చేయకూడదు. ఎక్కువ గంటలు పని/టైప్‌ చేసేటప్పుడు మధ్యమధ్యలో చేతికి విశ్రాంతి ఇవ్వాలి. బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు రెండు చేతులను ఉపయోగించాలి. పనిముట్లు ఉపయోగించేటప్పుడు మోచేతిపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. పని చేసేటప్పుడు మణికట్టును ఎక్కువగా వంచకుండా నిటారుగా ఉంచడానికి ప్రయత్నించాలి. పునరావృతమయ్యే పనులను ప్రారంభించే ముందు కండరాలు, స్నాయువులను సిద్ధం చేయడానికి, మణికట్టు, ముంజేతులను విస్తరించే వార్మ్‌-అప్‌, స్ట్రెచ్‌ వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి.

చికిత్స?
టెన్నిస్‌ ఎల్బో వ్యాయామాలు-రెగ్యులర్‌ టెన్నిస్‌ ఎల్బో వ్యాయామాలు ముంజేయి, మణికట్టు కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి, స్నాయువులపై ఒత్తిడిని తగ్గిస్తాయి. కండరాలను బలంగా ఉంచడానికి మణికట్టు కర్ల్స్‌, రివర్స్‌ రిస్ట్‌ కర్ల్స్‌, రెసిస్టెన్స్‌ బ్యాండ్‌ వ్యాయామాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి. చేయి కండరాలలో ఒత్తిడిని తగ్గించడానికి నిద్రపోతున్నప్పుడు చేతి కింద దిండ్లు ఉపయోగించవచ్చు. నొప్పి ఉన్న చోట రోజుకు మూడు నాలుగు సార్లు పావు గంట పాటు ఓర్చుకోగలిగే వేడి/ఐస్‌ ప్యాక్‌ పెట్టవచ్చు. మోచేయికి మద్దతునిచ్చే బ్యాండ్‌ ధరించవచ్చు. నొప్పి చాలా తీవ్రంగా ఉండి, రోజువారీ పనులు చేయలేకపోతే వైద్యులను సంప్రదించాలి. వైద్యులు నొప్పి కారకాన్ని నిర్ధారించడానికి కోజన్‌, మాడ్స్లీ, మిల్స్‌, చైర్లిఫ్ట్‌, రింగింగ్‌ టెస్ట్‌ వంటి భౌతిక పరీక్షలు, అవసరాన్ని బట్టి ఎక్సరే, ఎంఆర్‌ఐ, ఈఎంజీ, ఆల్ట్రాసౌండ్‌, థెర్మోగ్రఫీ, ఐసోటోప్‌ బోన్‌ స్కాన్‌ చేయవచ్చు. సమస్యను బట్టి వ్యాయామాలు, ఫీజియోథెరపీ, పనులు చేసుకొనే విధానాల్లో మార్పులు, నొప్పి తగ్గడానికి మందులు, ప్లేటిలెట్‌ రిచ్‌ ప్లాస్మా వంటి ప్రక్రియలతో నొప్పిని, వాపుని, సున్నితత్వాన్ని అదుపులో పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అవి విఫలమైతే సర్జికల్‌ పద్దతిని ఆశ్రయించాల్సిరావొచ్చు.

డా|| మీరా, ఎం.డి. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -