నవతెలంగాణ-హైదరాబాద్: బ్రిటన్, ఫ్రాన్స్ వంటి ప్రధాన యూరోపియన్ దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. అయితే ఇటలీ ప్రధాన మంత్రి జార్జియో మెలోని నేతృత్వంలోని ప్రభుత్వం పాలస్తీనాకు అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. సోమవారం మిలన్, రోమ్, వెనిస్, నేపుల్స్, జెనోవాతో సహా అనేక నగరాల్లో నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు.
ఇజ్రాయెల్‌కు ఆయుధాల రవాణాను నిరసిస్తూ డాక్ కార్మికులు అనేక ఓడరేవులను దిగ్బంధించారు. వెనిస్‌లో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. జెనోవా, లివోర్నో, ట్రీస్టే ఓడరేవులలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి.దీంతో పోలీసులు జనాన్ని నియంత్రించడానికి భాష్పవాయును ప్రయోగించారు. నిరసనకారుల దాడిలో 60 మందికి పైగా పోలీసు అధికారులు గాయపడ్డారు. 10 మందికిపైగా నిరసనకారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇటలీ ప్రధాని మెలోని ప్రస్తుతానికి పాలస్తీనాను గుర్తించడానికి నిరాకరించారు. ఉనికిలో లేని దేశాన్ని గుర్తించడం ప్రతికూల ఫలితాన్నిస్తుందని ఆమె చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై వామపక్ష పార్టీలు, యూనియన్ల సంఘాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగల్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇటీవల పాలస్తీనాను గుర్తించిన సమయంలో ఇటలీలో ఈ నిరసనలు వచ్చాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కూడా అనేక దేశాలు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. అయితే, మిలన్‌లో మెట్రో లైన్లు మూసివేయబడ్డాయి. టురిన్, బోలోగ్నాలోని విద్యార్థులు విశ్వవిద్యాలయ లెక్చర్ హాళ్లను దిగ్బంధించారు. దేశవ్యాప్తంగా ప్రజా రవాణా, సేవలు అంతరాయం కలిగింది.