నవతెలంగాణ-హైదరాబాద్: పొరుగుదేశమైన నేపాల్‌లో యువతరం మరోసారి భగ్గుమంది. రెండు నెలల క్రితం కేపీ ఓలీ (KP Sharma Oli) ప్రభుత్వాన్ని పడగొట్టిన కే జెన్‌జెడ్ (Gen-Z)ఈసారి ఆంక్షలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగింది. ప్రభుత్వం పగటిపూట కర్ఫ్యూ (Curfew)ను తిరిగి విధించడాన్ని ఖండిస్తూ బారా (Bara) జిల్లాలో వందలాది యువత ఆందోళనలు చేపట్టారు. కొత్త సర్కార్ ఏర్పడినప్పటి నుంచి మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ మద్దతుదారులు, జెన్‌జెడ్ నిరసనకారులకు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దాంతో.. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని పగటిపూట ఆంక్షలను మళ్లీ విధించింది. అసలే కోపం మీదున్న జెన్ జెడ్ కర్ఫ్యూను నిరసిస్తూ రోడ్డెక్కారు.
అంతర్గత వివాదాలు, సంక్షోభంతో నేపాల్ వార్తల్లో నిలుస్తోంది. అధికారం పోవడంతో మండిపోతున్న కేపీ ఓలీ పార్టీ నేతలు, కార్యకర్తలు జెన్‌జెడ్‌తో తరచూ ఘర్ణణలకు దిగుతున్నారు. తాజాగా సిమరా ప్రాంతంలో నవంబర్ 19న యువతరంతో ఓలీకి చెందిన నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) కార్యకర్తలు గొడవ పడ్డారు. ఇరువర్గాల ఘర్షణలతో ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చూడాలని మళ్లీ ఆంక్షలు విధించింది ప్రభుత్వం. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకూ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.



