Friday, May 2, 2025
Homeతాజా వార్తలుఅర్ధరాత్రి ఈదురుగాలుల బీభత్సం

అర్ధరాత్రి ఈదురుగాలుల బీభత్సం

– అతలాకుతలమైన రైతులు, ప్రజలు
– తీరని నష్టం.. ఆదుకోవాలని విజ్ఞప్తి
– నివేదికలు సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌శర్మ
నవతెలంగాణ- భూపాలపల్లి/మల్హర్‌రావు /గణపురం

జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మల్హర్‌రావు మండలం.. తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల గ్రామాల్లో బుధవారం అర్ధరాత్రి అకాల వర్షం కురిసింది. తాడిచెర్లలో మామిడి తోటల్లో చెట్లపై ఒక్క కాయలేకుండా నెలరాలాయి. ఇండ్లపై రేకులు ధ్వంసమయ్యాయి. ఇంటి గోడలు కూలిపోయాయి. పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. కరెంట్‌ స్తంభాలు విరిగిపోయి, తీగలు తెగిపడ్డాయి. కోతకు ఉన్న ధాన్యం ఒరిగిపోవడంతో గింజలు రాలి చేతికిరాకుండా పోయాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. పంటల నష్టంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సర్వేలు చేయించి పంట నష్టపరిహారం అందజేయాలని కోరుతున్నారు. విద్యుత్‌ సరఫరా నిలిపిపోవడంతో గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. పెద్దతూండ్ల గ్రామంలో అంగన్‌వాడీ సెంటర్‌-3 తలుపులు ధ్వంసమయ్యాయని అంగన్‌వాడి టీచర్‌ అన్నపూర్ణ తెలిపారు. గణపురం మండలంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. చెట్లు, విద్యుత్‌ పోల్స్‌ విరిగిపోయాయి. దీంతో మండలం బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు అంధకారంగా మారింది. వరి పంట. పూర్తిగా నేలమట్టమయింది. రోడ్డు వెంట ఉన్న పెద్ద చెట్టు కూలి అడ్డంగా పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎస్‌ఐ రేఖ అశోక్‌ ఆధ్వర్యంలో చోట్ల కొమ్మలను తీసేశారు. 17 గ్రామ పంచాయతీలలో విద్యుత్తు పోల్స్‌, భారీ వృక్షాలు కూలిపోవడంతో రాత్రి నుంచి గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. కొన్ని ఇండ్లపై తాటి చెట్లు విరిగి పడటంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. మామిడి తోటల్లో మామిడికాయలు పూర్తిగా నేలరాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంపై టార్ఫాలిన్‌ కవర్లు కప్పినప్పటికీ ఈదురు గాలుల వల్ల నష్టం జరిగింది. బుర్రకాయల గూడెంలో రత్నం బాబుకు చెందిన ఏడు ఎకరాల్లో మామిడికాయలు నేల రాలిపోయాయి.
నివేదికలు సిద్ధం చేయాలి
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఇండ్లకు సంబంధించిన పూర్తి నివేదికలు సిద్ధం చేసి తక్షణమే అందజేయాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలు, దెబ్బతిన్న ఇండ్లు, పంటలు వాతావరణ శాఖ యాప్‌ ద్వారా రైతులకు తక్షణ సమాచారం అందజేయడం.. తదితర అంశాలపై రెవెన్యూ, డీఆర్డీఓ, పౌర సరఫరాలు, మార్కెటింగ్‌, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్‌ అధికారిని ఆదేశించారు. డీఆర్డీఏ, సహకార శాఖల అధికారులు కొనుగోలు కేంద్రాల్లో ప్యాడి క్లీనర్లు, మాయిచర్స్‌, టార్ఫాలిన్లు, గన్నీలు, వేయింగ్‌ యంత్రాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. వాతావరణ శాఖ సూచనలు, సలహాలతో యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడూ రైతులను అప్రమత్తం చేయాలని, తద్వారా రైతులు ముందస్తు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌, కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, డిఆర్డీఓ నరేష్‌, పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాధ్‌, డిఎం రాములు, మార్కెటింగ్‌ అధికారి కనక శేఖర్‌, సహకార అధికారి వాలియా నాయక్‌, వ్యవసాయ అధికారి వీరు నాయక్‌, ఆర్డీఓ రవి, అన్ని మండలాల తహసీల్దార్లు, పాక్స్‌ సీఈఓలు పాల్గొన్నారు.
– జిల్లా కలెక్టర్‌ రాహుల్‌శర్మ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img