నవతెలంగాణ-హైదరాబాద్: సరిహద్దుల వివాదంతో థాయ్‌లాండ్-కాంబోడియా దేశాల యుద్ధం నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా 5 రోజుల తర్వాత ఆ రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధానికి ముగింపు పలికాయి.ఎలాంటి షరతులు లేకుండా కాల్పుల విరమణ చేయాలని రెండు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ASEAN అధ్యక్షుడిగా, సీజ్‌ఫైర్ చర్చలకు మధ్యవర్తిత్వం వహించాలని UNO ప్రతిపాదించగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరు దేశాల నాయకులతో మాట్లాడి కాల్పుల విరమణ చేయాలని కోరారు. దీంతో కాంబోడియా ప్రధాని హున్ మనెట్, థాయ్‌లాండ్ యాక్టింగ్ ప్రధాని ఫుమ్తామ్ వీచయాచై మలేసియాలోని పుత్రజయలో నేడు చర్చలు జరపడానికి అంగీకరించారు. ఈ చర్చలు సఫలం అయ్యి నిబంధనలు లేని తక్షణ సీజ్‌ఫైర్ అమలులోకి వచ్చినట్లు కాంబోడియా, థాయ్‌లాండ్, మలేసియా నాయకులు ఓ ప్రకటన జారీ చేసారు.
థాయ్‌లాండ్ – కాంబోడియా సరిహద్దుల్లోని ఖ్మెర్-హిందూ ఆలయం విషయంలో తలెత్తిన వివాదం కారణంగా జులై 24న ప్రారంభం అయిన సైనిక దాడులు నాలుగు రోజుల పాటు కొనసాగాయి. ఈ దాడుల్లో ఇరు దేశాలలో కనీసం 35 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. 2,00,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు.