నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జీవో 49ను నిలిపివేసింది. కొమురంభీం జిల్లాలో కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇటీవల జీవో 49ను విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయం పై స్థానిక ఆదివాసీలలో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని జీవోను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.
ఆదివాసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, వారి ఆందోళనలను నివృత్తి చేసే వరకు జీవో అమలును నిలిపి ఉంచాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. కన్జర్వేషన్ కారిడార్ వల్ల తమ జీవనోపాధిపై ప్రభావం పడుతుందని ఆదివాసీ సంఘాలు ఇటీవల పెద్దఎత్తున నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఈ అంశంపై మరిన్ని చర్చలు జరిపి, ప్రజల అనుమానాలను నివృత్తి చేసిన తరువాత తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.