– ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభంలో ప్రిన్సిపాల్ అనిత
నవతెలంగాణ – అశ్వారావుపేట : విద్యార్థులు చదువుతో పాటు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రభుత్వ జూనియర్ కళాశాల అశ్వారావుపేట ప్రిన్సిపాల్ అల్లు అనిత తెలిపారు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులందరూ పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు.
సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల అశ్వారావుపేట ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మండలంలోని పాత నారంవారిగూడెం లో ఏడు రోజుల శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ప్రిన్సిపాల్ అనిత అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ సేవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 1969లో ప్రారంభించిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక నూతన సర్పంచ్ మనుగొండ నాగమణి మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాల అశ్వారావుపేట విద్యార్థులు తమ సేవా కార్యక్రమాల కోసం తమ గ్రామాన్ని ఎంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గ్రామ పాలకవర్గం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డేగల నరసింహారావు మాట్లాడుతూ, విద్యార్థులను చదువుతో పాటు సమాజాభివృద్ధిలో భాగస్వాములను చేయడమే ఎన్ఎస్ఎస్ లక్ష్యమని తెలిపారు. ప్రతి విద్యార్థి సేవే మన కర్తవ్యంగా, దేశ అభివృద్ధే మన లక్ష్యంగా భావించాలని సూచించారు.
గ్రామ పెద్దలు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాన్ని తమ గ్రామంలో ప్రారంభించడాన్ని హర్షిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఎన్ఎస్ఎస్ ఏపీవో మానే శ్రీనివాసరావు, అధ్యాపకులు బి. రాంబాబు, చాంద్ పాషా, పంచాయతీ సెక్రెటరీ రమేష్, గ్రామ పెద్దలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
శిబిరం తొలి రోజున నారంవారిగూడెం మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న పొదలు ను విద్యార్థులు శ్రమదానం చేసి తొలగించారు.



