ఘనంగా “మే డే” ఉత్సవాలు
ఉత్సాహంగా పాల్గొన్న కార్మిక లోకం
నవతెలంగాణ – తాడ్వాయి
ఎనిమిది గంటల పని దినం, శ్రామిక వర్గ హక్కులను సాధించడం కోసం పోరాటం చేసి ప్రాణాలర్పించిన చికాగో అమరవీరుల స్మృతి దినం మే డే స్ఫూర్తితో ఉద్యమించాలి అని గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి అన్నారు. గురువారం మండలంలోని కాటాపూర్ గ్రామంలో సీఐటీయూ జెండా ను ఎర్రజు సత్యనారాయణ, చిట్టినేని శ్రీనివాస్ అధ్యక్షతన సి ఐ టి యు అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సెక్టార్ అధ్యక్షులు నిర్మల జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు కాటాపూర్ గ్రామంలో ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుగ్గి చిరంజీవి మాట్లాడుతూ.. ఈ ఏడాది మే డే నాటికి మనదేశంలో మే డే జరుపుకుని 102 ఏళ్లు పూర్తయ్యాయని, 1923లో అప్పటి మద్రాసు నగరంలో కామ్రేడ్ ఎం.సింగరవేలు ఎర్రజెండా ఎగురవేశారని అన్నారు. పెట్టుబడిదారీ వర్గం ప్రపంచమంతటా తన యొక్క దుర్మార్గపు, క్రూరపు ఎత్తుగడలను ఉపయోగిస్తూ కార్మికులు ఎన్నో వందల సంవత్సరాల పోరాటాలతో సాధించుకున్న కార్మికుల హక్కులను, 8 గంటల పని విధానాన్ని, వారి యొక్క కనీస వేతనాలు సామాజిక భద్రతను చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నించటం పట్ల కార్మికులు అప్రమత్తం అవసరం అని అన్నారు. భారతదేశాన్ని రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజల ఆమోదంతో సెక్యులర్ రాజ్యంగా పొందుపరిచినప్పటికీ , దానిని హిందూ రాష్ట్రం కింద మార్చడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ చేస్తున్న ఇలాంటి విచ్ఛిన్నకర కుతంత్రాల పట్ల కార్మికవర్గం అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ఐక్యతను విచ్చినం చేసే శక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచారు. కొన్నిచోట్ల ఎటువంటి హక్కులు లేకుండా దాదాపు బానిసలుగా మారుస్తున్నారని, అదే సమయంలో ఇప్పుడు అమలులో ఉన్న అన్ని చట్టాలను నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారని ధ్వజమెత్తారు. లేబర్ కోడ్ లు అమలు ఇప్పటికే ప్రారంభమైందని, దానికి సంబంధించి పాలనాపరమైన చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది అన్నారు. పాలకవర్గం యొక్క వినాశకర, ప్రజావ్యతిరేక నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల ఐక్య పోరాటాన్ని విస్తృతం చేయడం, పెంచడం ద్వారా, ప్రజలను, కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పాలకులను ప్రతిఘటిస్తామని పేర్కొన్నారు. అనంతరం వివిధ ప్రజా సంఘాల నాయకులు, మేధావులు మాట్లాడారు. దేశాన్ని కాపాడాలన్నా, అలాగే ప్రజలను కాపాడాలన్నా 2029 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని అన్నారు. కార్మికులు, ప్రజలు కార్మిక అనుకూల, ప్రజా అనుకూల విధానాల కోసం విస్తారంగా పోరాటాలు చేయాలని పిలుపునిచారు. ప్రత్యామ్నాయ, ప్రజా అనుకూల విధానాల కోసం పోరాటాన్ని ఉధృతం చేద్దాం అని ఆయన అన్నారు. లాంగ్ లివ్ మే డే కార్మికవర్గ ఐక్యత వర్ధిల్లాలి.
కార్మిక రైతు కూటమి వర్ధిల్లాలి .. సోషలిజం వర్ధిల్లాలి..
పెట్టుబడిదారీ విధానం నశించాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో కేజీకేఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్య గౌడ్, పెరక సంఘం జిల్లా అధ్యక్షులు, తెరాస నాయకులు దిడ్డి మోహన్ రావు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు తుర్క వీరబాబు, మాజీ సర్పంచ్ మేడిశెట్టి నరసింహయ్య, బీసీ సంఘం నాయకులు పులి రవి గౌడ్, మాజీ ఎంపీటీసీ దానక నరసింహారావు,మద్దూరి రాములు, రాజు, ముత్తినేని లక్ష్మయ్య, హమాలి నాయకుడు అబ్బు పుల్లయ్య, ఎమ్మార్పీఎస్ నాయకుడు పుల్లూరి కరుణాకర్, సీఐటీయూ మండల నాయకులు చిట్టీనేని శ్రీనివాస్, కనుమల్ల శ్రీను, సి ఐ టి యు అంగన్వాడీ టీచర్స్ వెంకట్ లక్ష్మి, నాగమణి, సత్యమ్మ, ఆశాలు, అంగన్వాడి టీచర్లు హెల్పర్స్, హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
కాటాపూర్ లో రేపరెపలాడిన అరుణ పతాకం..
- Advertisement -
RELATED ARTICLES