Saturday, May 3, 2025
Homeజాతీయంకులగణనపై దిగొచ్చిన కేంద్రం

కులగణనపై దిగొచ్చిన కేంద్రం

– గత వైఖరికి భిన్నంగా నిర్ణయం
– వివిధ పార్టీలు, వర్గాల డిమాండే కారణం
– రిజర్వేషన్ల పెంపు, ఓబీసీల ఉపవర్గీకరణకు అవకాశం
న్యూఢిల్లీ:
జనగణనతో పాటే కులగణన కూడా జరుపుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దశాబ్దాల తరబడి వివిధ వర్గాల వారు చేస్తున్న డిమాండ్‌కు ఎట్టకేలకు ప్రభుత్వం తలవంచింది. నాలుగు సంవత్సరాల క్రితం పార్లమెంటులో అధికారికంగా వ్యక్తపరచిన వైఖరిని మార్చుకుంది. సమాజం యొక్క సామాజిక, ఆర్థిక నిర్మాణాన్ని కులగణన బలోపేతం చేస్తుందని ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. వాస్తవానికి కులగణన డిమాండ్‌ ఈనాటిది కాదు. 1951 నుంచి సేకరిస్తున్న జనాభా లెక్కలలో ఎస్సీలు, ఎస్టీలు, వివిధ మతాలకు చెందిన వారి సమాచారం ఉంది. అయితే ఎస్సీలు, ఎస్టీలు కాకుండా మిగిలిన కులాల వారి సంఖ్యను ఆయా సందర్భాలలో లెక్కించలేదు.
నాడు తిరస్కరించి…
1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా అందుబాటులోకి వచ్చిన కుల డేటాయే మన వద్ద ఉన్న తాజా సమాచారం. 1941లో యుద్ధ సమయంలో జరిగిన జనగణనలో కూడా కులాల లెక్కలు తీశారు కానీ వాటిని ఎన్నడూ బహిర్గతం చేయలేదు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు జరిగిన తొలి జనాభా లెక్కల సేకరణలో కులం ప్రస్తావన తేలేదు. అయితే ఆ తర్వాత కులగణన కోసం డిమాండ్లు పెరిగాయి. ముఖ్యంగా ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), వ్యవసాయదారులు, చేతివృత్తుల వారు ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. అయితే దేశాన్ని పాలించిన ఏ ఒక్క ప్రభుత్వం కూడా కులాల లెక్కలు తీయలేదు. 2010లో జనాభా లెక్కలు సేకరిస్తున్న సమయంలో అప్పటి న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఓ లేఖ రాశారు. 2011 జనగణనలో కులం, సమాజం డేటాను సేకరించా లని కోరారు. ఈ అభ్యర్థనను ప్రధాని కార్యాలయం భారత రిజిస్ట్రార్‌ జనరల్‌-జనాభా లెక్కల కమిషన్‌కు పంపింది. అయితే ఆ అభ్యర్థనను కమిషన్‌ తోసిపుచ్చింది. ఆర్జేడీ, సమా జ్‌వాది, డీఎంకే, జేడీయూ వంటి పార్టీలతో పాటు బీజేపీకి చెందిన కొంతమంది ఓబీసీలు కులగణన కోసం చేసిన డిమాండ్‌పై 2010 మేలో నాటి హోం మంత్రి పి.చిదంబరం స్పందిస్తూ ఆచర ణలో ఎదురయ్యే సమస్యలను ఏకరువు పెట్టారు.
వెలుగు చూడని లెక్కలు
అయితే యూపీఏ మిత్రపక్షాల ఒత్తిడి నేపథ్యంలో కులగణనపై పరిశీలన జరిపేందుకు మన్మోహన్‌ ప్రభుత్వం అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. దాని సిఫారసుల ఆధారంగా కేంద్ర క్యాబినెట్‌ 2010 సెప్టెంబరులో ప్రత్యేక సామాజిక ఆర్థిక కులగణన (ఎస్‌ఈసీసీ)పై నిర్ణయం తీసుకుంది. 2011లో జనగణన పూర్తయిన తర్వాత జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ దశల వారీగా కులగణన జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. రూ.4,900కోట్ల వ్యయంతో నిర్వహించిన ఎస్‌ఈసీసీ డేటాను 2016లో ప్రచురించిన ప్పటికీ కులాల లెక్కలను మినహాయించారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు కుల డేటాను అందజేశారు. ఆ మంత్రిత్వ శాఖ కులాల వర్గీకరణ కోసం అప్పటి నిటి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మెన్‌ అరవింద్‌ పనగారియా నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ సమా చారం కూడా నేటి వరకూ వెలుగు చూడలేదు.
గత వైఖరికి భిన్నంగా…
గత లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ మినహా మిగిలిన పార్టీలన్నీ కులగణనకు మద్దతు తెలిపాయి. బీహార్‌లో బీజేపీ కూడా ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకుంది. ప్రభుత్వంలోని కీలక స్థానాలలో ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తరచూ విమర్శించారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో తమ సొంత కులగణన ఆధారంగా ఓబీసీలను వర్గీకరించడం ద్వారా కోటాలో కోటాను అమలు చేసేందుకు ప్రయత్నించాయి. వీటికి సర్వేలు అని పేరు పెట్టాయి. ఎందుకంటే జనగణన అనేది సాంకేతికంగా కేంద్రం చేయాల్సిన పని. కులగణన కోసం ఎన్ని డిమాండ్లు ముందుకు వచ్చినప్పటికీ ఎస్సీలు, ఎస్టీలు కాకుండా ఇతరత్రా కులాల వారీ లెక్కలు సేకరించరాదని విధానపరంగా నిర్ణయం తీసుకున్నామని 2021 జూలై 20న ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. అయితే నాటి వైఖరికి భిన్నంగా కేంద్రం ఇప్పుడు కులగణనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కులగణన చేపట్టాలంటూ సుప్రీంకోర్టులో ఇప్పటికే అనేక పిటిషన్లు పెండింగులో ఉన్నాయి.
అన్నింటికీ అదే ఆధారం
2021లో జరగాల్సిన జనగణన కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఆగిపోయింది. ఎప్పుడు జరిగేదీ ఇంకా కచ్చితంగా తెలియడం లేదు. 2021 జనగణన ప్రశ్నావళిని ఆ ప్రక్రియను వాయిదా వేయడానికి ముందే ఖరారు చేశారు. లోక్‌సభ, శాసనసభల నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కూడా 1971 నుంచి చేపట్టలేదు. 2026లో జనగణన చేపట్టిన తర్వాత ఆ పనులు మొదలు పెడతారు. చట్టసభలలో మహిళా రిజర్వేషన్ల అమలు కూడా జనగణన, నియోజకవర్గాల పునర్విభజనపైనే ఆధారపడి ఉంది. ఏదేమైనా కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్‌ కు, కుల వర్గాలు…ముఖ్యంగా ఓబీసీలలో ఉప వర్గీకరణకు కులగణన ఊతమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img