సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు
హైదరాబాద్‌లో నవంబర్ 1, 2 తేదీల్లో శ్రామిక మహిళల జాతీయ సదస్సు
నవతెలంగాణ-కాగజ్‌నగర్
మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు. కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని వినరు గార్డెన్‌లో రెండో రోజు సోమవారం తెలంగా ణ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.సాయిబాబు మాట్లాడుతూ.. దేశంలోని 50 కోట్ల మంది కార్మికుల కు పని, సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రోజు రోజుకూ దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, గంటకు 50 కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో ఆశా వర్కర్‌పై లైంగికదాడి, హత్య జరిగినా ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. ఇలాంటి కేసులను విచారించే పద్ధతుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. 100 కేసులకు సుమారు 27 కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయని, దోషులకే ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయని విమర్శించా రు. లైంగిక వేధింపుల చట్టం 2013ను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సత్వరమే శిక్షలు విధించడం ద్వారా ఈ కేసుల సంఖ్యను తగ్గించే అవకాశముందన్నారు.
కేరళ రాష్ట్రంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం మాత్రమే పని ప్రదేశాల్లో మహిళలకు కనీస సౌకర్యాలు అమలు చేస్తోందని చెప్పారు. రాత్రి సమయాల్లో కూడా మహిళా ఆరోగ్య సిబ్బంది విధులను నిర్వర్తిస్తుంటారని, వీరి కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలనే అనుసరిస్తోందని విమర్శించారు. నవంబర్ 1, 2 తేదీల్లో హైదరాబాద్‌లో అఖిల భారత శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు సాయిబాబు తెలిపారు. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు 25 రాష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది కార్మిక నాయకులు హాజరు కానున్నట్టు తెలిపారు. సీఐటీయూ జాతీయ అధ్యక్షులు కె.హేమలత, ప్రధాన కార్యదర్శి తపన్ సేన్, ఆలిండియా వర్కింగ్ ఉమెన్ కన్వీనర్ ఎకె సింధు ఈ సదస్సుకు హాజరవుతారని చెప్పారు. సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆర్.త్రివేణి అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, కార్యదర్శి పద్మశ్రీ, ఉపాధ్యక్షులు భూపాల్, కోశాధికారి వంగూరు రాములు, శ్రామిక మహిళ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్‌వి.రమ, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు వి.ఆనంద్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జె.రాజేందర్, ముంజం శ్రీనివాస్, ప్రజాసంఘాల నాయకులు కూశన రాజన్న, దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, ముంజం ఆనంద్‌కుమార్, గొడిసెల కార్తీక్, గెడం టీకానంద్, కృష్ణమాచారి, జిల్లా కార్యదర్శి ఆర్.మహేష్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నేర్పల్లి అశోక్, దిగిడ బక్కన్న పాల్గొన్నారు.
మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్రం విఫలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES