నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ నర్సు నిమిష ప్రియకు చెందిన కేసు చాలా సున్నితమైన అంశం అని, మరణశిక్షను తప్పించేందుకు ప్రభుత్వం వీలైనంత సాయం చేస్తోందని కేంద్ర విదేశాంగ ఇవాళ పేర్కొన్నది. యెమెన్ దేశస్థుడిని హత్య చేసిన కేసులో ఆ దేశం ఆమెకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈనెల 16వ తేదీన నిమిష ప్రియను ఉరితీయాల్సి ఉంది. కానీ ఆ నిర్ణయాన్ని యెమెన్ దేశం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. నిమిష ప్రియ కేసు కోసం కొన్ని స్నేహపూర్వక దేశాలతో టచ్‌లో ఉన్నట్లు తెలిపింది. చాలా క్లోజ్‌గా ఆ అంశాన్ని ఫాలో అవుతున్నామని, అన్ని రకాల సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థాకి అధికారులతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
తలాల్ అబ్దో మెహదీని 2017లో హత్యచేసిన భారతీయ నర్సు నిమిష ప్రియకు క్షమాభిక్ష ప్రసాదించాలని లేదా నష్టపరిహారం తీసుకోవాలని(బ్లడ్ మనీ) వస్తున్న ప్రతిపాదనలను తమ కుటుంబం అంగీకరించే ప్రసక్తి లేదని బాధిత సోదరుడు అబ్దెల్ ఫత్తా మెహదీ స్పష్టం చేశారు. షరియా చట్టం ప్రకారం ప్రతీకార న్యాయం(కిసాస్) కావాలన్న తమ డిమాండును ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. చేసిన నేరానికి నిమిషను ఉరితీయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.