Tuesday, August 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మిక హక్కులను తాకట్టుపెడుతున్న కేంద్రం

కార్మిక హక్కులను తాకట్టుపెడుతున్న కేంద్రం

- Advertisement -

– పనిగంటలు పెంచి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు
– డిసెంబర్‌ 7-9 తేదీల్లో మెదక్‌లో సీఐటీయూ రాష్ట్ర ఐదవ మహాసభలు : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌. వీరయ్య
నవతెలంగాణ-మనోహరాబాద్‌

పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మికులను బానిసలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని, 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్స్‌ను తీసుకువచ్చిందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌ వీరయ్య అన్నారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభల ఆహ్వానసంఘం ఆధ్వర్యంలో సోమవారం మెదక్‌ జిల్లా తుప్రాన్‌లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ. మహేందర్‌ రెడ్డి అధ్యక్షతన ”లేబర్‌ కోడ్స్‌, కార్మికులపై ప్రభావం” అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. 2014లో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నయా ఉదారవాద ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేస్తున్నదని అన్నారు. కార్మికుల హక్కులను కాలరాయడంతో పాటు ఫిక్స్డ్‌ టర్మ్‌ ఎంప్లాయిమెంట్‌ను చట్టబద్ధం చేసి ఉద్యోగుల భద్రతకు ముప్పు తెచ్చిందని తెలిపారు. కార్మికులు పోరాడి సాధించుకున్న సమ్మె హక్కు లేకుండా పోతుందని, సంఘం పెట్టుకునే హక్కునూ కోల్పోతున్నారని అన్నారు. పని గంటలు పెంచి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమూ వత్తాసు పలుకుతూ జీవో తీసుకొచ్చిందని తెలిపారు. యాజమాన్యాలు, ప్రయివేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రయోజనాల కోసం ఈఎస్‌ఐ సంస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. కార్మికులు వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, వర్కింగ్‌ కండిషన్స్‌ కోడ్స్‌ వలన అనేక ప్రయోజనాలను కోల్పోతారన్నారు. దేశంలో ఇప్పటికే మహిళలకు రక్షణ, భద్రత లేదని, పైగా నైట్‌ షిఫ్ట్ప్ల్‌లో రాత్రి 9 నుంచి ఉదయం 7 వరకు వారు పనిచేసేలా కోడ్స్‌లో పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ మెదక్‌ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం మాట్లాడుతూ.. మెదక్‌ జిల్లాలో డిసెంబర్‌ 7-9 తేదీల్లో సీఐటీయూ రాష్ట్ర ఐదవ మహాసభలు జరగనున్నాయని, దీనికి 33 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరు అవుతున్నారన్నారు. మహాసభల నిర్వహణ కోసం జిల్లా ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సెమినార్‌లో ఆహ్వాన సంఘం వైస్‌ చైర్మెన్‌ ఎం.అడివయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ. మహేందర్‌ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి గౌరయ్య, కావేరి యూనియన్‌ కార్యదర్శి బాలయ్య, ఇండస్‌ మెడికర్‌ యూనియన్‌ కార్యదర్శి బాలేష్‌, తిరుపతి, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఇందిరా, ఆశా యూనియన్‌ నాయకులు రేణుక, గ్రామ పంచాయతీ యూనియన్‌ నాయకులు శ్రీకాంత్‌, పోచయ్య, యూనియన్‌ నాయకులు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -