Thursday, July 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాజ్యాంగం నిర్వీర్యానికి కేంద్రం కుట్ర

రాజ్యాంగం నిర్వీర్యానికి కేంద్రం కుట్ర

- Advertisement -

ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక ఆంతర్యమేంటి?
ప్రజల ఆశలకు భిన్నంగా రాష్ట్రంలో పాలన : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ- సూర్యాపేట

దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు కలిసి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి సామాజిక న్యాయాన్ని సమాధి చేసేందుకు కుట్ర చేస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ రాజీనామా వెనుక ఆంతర్యమేంటో ప్రజలకు తెలియాల్సి ఉంది అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్టార్‌ బాంకేట్‌ హల్‌లో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి మతోన్మాద, మనువాద శక్తులకు అనుకూలంగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో కుల, మత ఘర్షణలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను కాలరాసే విధంగా దోపిడీ పాలన సాగుతోందన్నారు. దేశ రాజధాని నుంచి గ్రామాల వరకూ దళిత సంఘాలు హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ఆగస్టు, సెప్టెంబరులో గ్రామాల్లో విస్తృత పర్యటనలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, దళిత వాడలను పోరాట కేంద్రాలుగా మార్చాలని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల ఆశలకు భిన్నంగా పాలన చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు దళితబంధు కింద ప్రకటించిన రూ.12 లక్షలు అందకపోవడం, వ్యవసాయ కార్మికులకు రూ.12,000, మహిళలకు నెలకు రూ.2,500, వికలాంగులకు రూ.6,000 పెన్షన్‌ పెంపు ప్రకటనలన్నీ ఉత్తమాటలేనని విమర్శించారు. రాష్ట్రంలో ఇల్లు, స్థలాలు లేని 30 లక్షల మంది పేదలకు న్యాయం జరగలేదని, నాలుగు లక్షల ఇండ్ల ప్రకటనలు చేసినా మంజూరైనవి పల్లె, పట్టణాల్లో నాలుగు, పది ఇండ్లను మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అఖిలపక్షాన్ని కూడగట్టుకొని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్‌ బాబు, జిల్లా కార్యదర్శి కోట గోపి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -