Wednesday, December 10, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివరుస మారుతున్న వందేమాతరం

వరుస మారుతున్న వందేమాతరం

- Advertisement -

దేశ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్ష రగిలించడంలో వందేమాతర గీతం పోషించిన పాత్ర ఎంతో గొప్పది. ప్రతి భారతీయుడికీ ఆనాడు ఇదొక నినాదం. కానీ స్వాతంత్య్ర సమరంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బ్రిటిష్‌ వాళ్లకు మోకరిల్లిన చరిత్ర ఆరెస్సెస్‌ది. అసలు వందేమాతరమే పాడని ‘దేశభక్తి’ వారిది. అలాంటి వారసులు ఇప్పుడు ఆ గీతం గురించి, స్వాతంత్రోద్యమ స్ఫూర్తి గురించి మాట్లాడడం ఎంతటి హాస్యాస్పదం! 150 ఏండ్ల చరిత్ర కలిగిన వందేమాతర గీతాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఎన్నో ఏండ్ల కిందట సమిసిపోయిన వివాదాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు. దీని కోసం పార్లమెంటును వేదిక చేసుకున్నారు. వందేమారత గీతాన్ని నెహ్రూ ముక్కలు చేశారంటూ లోక్‌సభలో విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో ఎన్నో సమస్యలుంటే వందేమాతరంపై చర్చించేందుకు పార్లమెంటును నడిపిన ఘనత ఒక్క మోడీకే చెల్లుతుందేమో!

స్వాతంత్రోద్యమ కాలంలో దేశ ప్రజలందరినీ చైతన్య పరిచేందుకు బంకింగ్‌ చంద్రఛటర్జీ ఆనంద్‌మఠ్‌ నవలలో రాసిన గీతంలోని రెండు చరణాలను మాత్రమే ఆనాడు అందరూ ఉపయోగించారు. ఆ మిగిలిన ఆరు చరణాలు కేవలం బెంగాల్‌ ప్రాంతానికి, నవలకు మాత్రమే చెందినవి. అందుకే మొత్తం గీతాన్ని తన నవలలో ముద్రించుకున్నారు. ఆయనే కాదు ఎందరో మేధావులు క్షుణ్ణంగా చర్చించి, లోతుగా పరిశీలించి ఒక్క ప్రాంతానికి చెందిన అంశాలను పక్కన పెట్టి దేశ ప్రజలందరినీ ఏకం చేసే ఆ రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని నిర్ణయించారు. వీరిలో నెహ్రూతోపాటు వందేమాతర గీతానికి స్వర రచన చేసిన ప్రముఖ కవి రవీంధ్రనాథ్‌ ఠాగూర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, అబుల్‌ కలాం ఆజాద్‌ సైతం ఉన్నారు. ఆ చరిత్రనంతా విస్మరించి మన పాలకులు ఇప్పుడు వివాదం చేసి మళ్లీ రేపుతున్నారు. ఆ మిగిలిన చరణాలపైనే పట్టుబడుతున్నారు. తామే అసలు సిసలైన దేశ భక్తులమంటూ గప్పాలు కొట్టుకుంటున్నారు. అందుకే ”స్వాతంత్య్ర పోరాటంలోని ప్రతి నినాదం వెనుక లక్షలాది మంది ప్రజలు ర్యాలీ అయ్యారు. కానీ మీరు ఏ నినాదం వెనుక ర్యాలీ చేయించారో చెప్పండీ?” అంటూ సీపీ(ఐ)ఎం ఎంపీ వెంకటేషన్‌ పార్లమెంటు సాక్షిగా మోడీని సూటిగా ప్రశ్నించారు.

1905లో బెంగాల్‌ విభజన సందర్భంలో వందేమాతరం నినాదం గా మారింది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కూడా ఈ గీత ఆలాపనపై చర్చ జరిగింది. అప్పుడు కూడా రెండు చరణాలను మాత్రమే పాడాలని నిర్ణయించారు. దీన్ని ప్రతిపాదించింది డాక్టర్‌ బాబు రాజేంద్రప్రసాద్‌ అయితే బలపరిచింది బీజేపీ పూర్వ రూపమైన భారతీయ జన్‌సంఫ్‌ు నాయకుడు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ. మోడీ ప్రేమంతా వందేమాతరంపైనే అయితే వీరిని కూడా విమర్శించాలి కదా! 2006 నుండే బీజేపీ వందేమాతర గీతంలోని మిగిలిన చరణాలను దేశ ప్రజలపై బలవంతంగా రుద్దాలని చూసింది. మొత్తం గీతాన్ని ఆలపించాలంటూ తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో జీవోలను సైతం జారీ చేసింది. అసలు వందేమాతరంపై బీజేపీ ఎందుకింత పట్టుబడుతోంది. ఇక్కడే ‘నమో’ వ్యూహం దాగుంది. జనంలో అయోధ్య మందిరం మగత దిగిపోయాక తదుపరి ఎన్నికల్లో వందేమాతరం నినాదాన్ని ఉపయోగించాలని ఆనాడే నిర్ణయించుకుంది. ఆ ఆయుధాన్ని ఇలా ప్రజలపై వదులుతోంది.
వందేమాతర గీతం రాసిన బకింగ్‌చంద్ర ఛటర్జీ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత. త్వరలో జరగబోతున్న ఆ రాష్ట్ర ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బెంగాల్‌ ప్రజలను ఈ సెంటిమెంట్‌తో కొట్టి ఓట్లు పట్టాలనేది బీజేపీ పన్నాగం. ఒకపక్క దేశ ప్రజలు అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారు. అర్థాంతరంగా ఆగిపోయిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ వల్ల వేలాదిగా ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు. బాంబు పేలుళ్ల మధ్య దేశం భయం గుప్పెట్లో బతుకుతోంది. వాయు కాలుష్యం పెరిగి గాలి విషపూరితమై ఢిల్లీ వంటి మహా నగరాలలో ప్రజలు ఊపిరి పీల్చుకోడానికే జంకుతున్నారు. రోజురోజుకూ రూపాయి విలువ కుప్పకూలిపోతూ దేశ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వరంగ పరిశ్రమలన్నీ మూతబడి కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఉద్యోగాలు లేక యువత అసంతృప్తిలో జీవిస్తున్నారు. ఇవేవీ మన ఏలికలకు పట్టవు. దేశంలో ఇన్ని సమస్యలుంటే ఆయన మాత్రం వందేమాతరం గురించి, నెహ్రూ గురించి మాట్లాడుతున్నారు.
స్వాతంత్య్రోద్యమంలో వందేమాతర గీతమే పాడని వారు.. నేటికీ పాడలేని వారు ఆ గీతం గురించి విలపించడం విచిత్రం. ఇలా వారు ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసినా ఏ మాటల వెనుక ఏ ప్రయోజనం దాగివుందో తెలుసు కోలేనంత అమాయకులు కాదు ప్రజలు. దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన యోధులను, దేశ భవిష్యత్తు కోసం ఆనాడు తీసుకున్న నిర్ణయాలను అవమానిస్తే చూస్తూ ఊరుకోరు. ప్రజా సమస్యలన్నీ పక్కన పెట్టి ఓట్లు, సీట్ల కోసం సెంటిమెంట్లు వాడుకుంటూ చరిత్ర వక్రీకరణకు పూనుకుంటున్న బీజేపీ ఎత్తుగడలను తిప్పికొట్టాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -