నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం …. పాకిస్థాన్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా భారత్ తన గగనతలాన్ని మూసివేసిన సంగతి విదితమే. న్యూఢిల్లీలో తీసుకున్న ఈ కీలక నిర్ణయం కారణంగా, పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి భారీ ఆర్థిక నష్టం సంభవించిందని సమాచారం. పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అసెంబ్లీలో సమర్పించిన నివేదికలు ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నట్టు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆ నివేదికల ప్రకారం … ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 వరకు భారత గగనతలం మూసివేయడంతో, పాకిస్తాన్‌కు రూ.4.10 బిలియన్ల నష్టం వాటిల్లింది.
పాక్‌కు రూ.126 కోట్లు నష్టం
భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.126 కోట్లకు సమానం. భారత ఆంక్షల కారణంగా రోజువారీ 100 నుంచి 150 విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయని, దాని ఫలితంగా విమాన రాకపోకలు సుమారు 20 శాతం వరకు తగ్గాయని నివేదికలో పేర్కొంది. దీని ప్రభావం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆదాయంపై గణనీయంగా పడినట్టు వెల్లడించింది. పహల్గాం దాడి తర్వాత ఉద్భవించిన దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో,భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడమే కాకుండా గగనతలాన్ని కూడా మూసివేసిన విషయం గుర్తుచేశారు. పాకిస్తాన్ విమానాలపై అమలులో ఉన్న ఈ గగనతల ఆంక్షలను భారత్ ఆగస్టు 24 వరకు పొడిగించిన సంగతి కూడా నివేదికలో ప్రస్తావించారు.