Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్న కాంగ్రెస్‌ సర్కారు

అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్న కాంగ్రెస్‌ సర్కారు

- Advertisement -

ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని, ప్రభుత్వం సభ హుందాతనాన్ని దిగజారుస్తోందని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, ఘోష్‌ కమిటీ నివేదిక ఆధారంగానే సీబీఐ విచారణ కోరుతున్నామని స్పష్టం చేశారు. ‘ఘోష్‌ కమిటీ నివేదికను ఇంతవరకు బయటపెట్టకుండా సీబీఐ విచారణ ఎలా కోరతారు? ప్రాజెక్టులో ఎస్టిమేషన్లు, అప్రూవల్స్‌, పనుల్లో భారీ తప్పులు జరిగాయి’ అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన ‘మెగా ఇంజినీరింగ్‌’ సంస్థకు మళ్లీ ‘మన ఊరు-మన బడి’ పథకంలో పనులు అప్పగించడం ఏంటని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసెంబ్లీని ఏ విధంగా నడిపిందో, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వమూ అదే బాటలో పయనిస్తోందని విమర్శించారు. సభలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, మిత్ర పక్షాలకు గంటల కొద్దీ సమయం ఇస్తూ, ప్రతిపక్షాలను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న వారిని బీఆర్‌ఎస్‌ సభ్యునిగా స్పీకర్‌ గుర్తించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలు ఉన్నా, వాటిని పక్కనపెట్టి అసెంబ్లీని కేవలం రాజకీయ ఆరోపణల వేదికగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్‌ ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు, పోలీసుల సరెండర్‌ బిల్లులు, టీఏలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందనీ, రిటైర్డ్‌ ఉద్యోగులు తమ తల్లిదండ్రులను ఎలా పోషించుకోవాలి? అని ప్రశ్నించారు. యువతకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. మైనింగ్‌ అవినీతిపై హౌస్‌ కమిటీ వేయాలని డిమాండ్‌ చేస్తే, దర్యాప్తును నీరుగార్చడానికి సీబీసీఐడీకి అప్పగిస్తామని తప్పించుకుంటున్నారని అన్నారు. ‘నువ్వు దొంగ అంటే, నువ్వు దొంగ’ అని తిట్టుకోవడం తప్ప, సమస్యల పరిష్కారంపై సోయి లేదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -