జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ వనపర్తి
మొక్కజొన్న పంట కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం చిన్నంబావి మండల కేంద్రంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. మండలంలో ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారని వ్యవసాయ అధికారులను ఆరా తీయగా 9500 ఎకరాల్లో సాగు చేసినట్లు బదులిచ్చారు. అనంతరం ఓ రైతు తెచ్చిన మొక్కజొన్న పంట ధాన్యం లో తేమను స్వయంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పలువురు రైతులు మాట్లాడుతూ తమకు మొక్కజొన్న పంటను విక్రయించేందుకు చిన్నంబావిలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం దూరం అయిందని, అయ్యవారిపల్లిలో మరో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్కు విన్నవించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రైతుల విజ్ఞప్తిని సంబంధిత మార్క్ఫెడ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైతే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు.
విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా బోధించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
వెనుకబడిన విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా అర్థం చేసేందుకు ప్రారంభించిన కంప్యూటర్ తరగతుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం చిన్నంబావి మండల పరిధిలోని వెలుగొండ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏఐ ద్వారా బోధన చేసేందుకు తరగతి గదుల్లో సరిపడు కంప్యూటర్లతో పాటు, అంతరాయం లేని ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించాలని ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలలో పీఎం శ్రీ కింద చేపడుతున్న కార్యక్రమాల గురించి ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా పాఠశాలలో ఎఫ్ ఆర్ ఎస్ అటెండెన్స్ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.
bhu-bharati రెవెన్యూ దరఖాస్తుపై క్షేత్రస్థాయి విచారణలో పాల్గొన్న కలెక్టర్
చిన్నంబావి మండల పరిధిలోని చిన్నమారూర్ గ్రామానికి చెందిన 10 మంది రైతులు రెవెన్యూ రికార్డుల్లో భూమి తమ పేరిట ఎక్కలేదని భూభారతి రెవెన్యూ సదస్సులో అర్జీ పెట్టుకున్నారు. 201 సర్వేనెంబర్ లో 7 ఎకరాల 26 గుంటల భూమికి సంబంధించి వారు పెట్టుకున్న అర్జీకి సంబంధించి కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేశారు. అర్జీదారుల సమస్యపై రికార్డులను పరిశీలన చేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన కలెక్టర్కు వెల్టూరు గ్రామ ప్రజలు తమ గ్రామంలో మద్యపానం నిషేధం కొరకు తీర్మానం చేసినట్లు కలెక్టర్కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసిల్దార్ కే శ్రీనివాస్, స్థానిక మండల నాయకులు కళ్యాణ్ రావు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.



