నవతెలంగాణ-హైదరాబాద్: దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితం బ్రిటీష్ పాలన నుండి స్వేచ్ఛ పొందిన తరువాత కూడా.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ హయాంలో.. భారతదేశం స్వతంత్రంగా లేదు అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఫైర్ అయ్యారు. ‘భారత్ స్వాతంత్య్రం సాధించుకుని 78 ఏళ్లు పూర్తి చేసుకుంది. కానీ ప్రస్తుత ఫాసిస్టు బిజెపి పాలనలో ప్రజలు నిజంగా స్వతంత్రంగా, స్వేచ్ఛగా లేరు’ అని మమతా బెనర్జీ గురువారం ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే తాము నిజమైన స్వాతంత్య్రం సాధించాలనే కలతో మత సామరస్యం, జాతీయ సమైక్యత కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ఆమె ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
కాగా, బెంగాలీ మాట్లాడేవారిని బిజెపిపాలిత రాష్ట్రాల్లో వేధిస్తున్నారని, ఎన్నికల సంఘాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి ఉపయోగించుకుంటోందని ఆమె విమర్శించారు. బిజెపి విభజన ఎజెండాను ముందుకు తెస్తుందని, ప్రాథమిక హక్కులైన ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛను, ఉద్యమించే హక్కును హరించేందుకు బిజెపి చేసే ఏ ప్రయత్నమైనా.. తను చివరి శ్వాస వరకూ పోరాడతానని ఆమె అన్నారు.