– కార్పొరేట్ శక్తుల చేతుల్లో మీడియా
– ఉగ్రదాడి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే..
– పార్లమెంటు సమావేశం ఎందుకు ఏర్పాటు చేయరు?
– మావోయిస్టుల మృతదేహాలను బంధువులకు అప్పగించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మఠంపల్లి
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కేంద్రంలోని బీజేపీ పాలకులు బలహీనపరిచారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశం పెట్టుబడిదారులు, ఆక్రమణదారులతో నిండిపోయిందనీ, వారికి అనుకూలమైన చట్టాలు చేస్తూ, పార్లమెంట్ వ్యవస్థ మొత్తం వారికే ఉపయోగపడుతోందని అన్నారు. న్యాయవ్యవస్థ సైతం పట్టాలు తప్పిందని, మీడియా మొత్తం కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అయిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి కావాల్సిన నాలుగు పిల్లర్లు గాడితప్పి పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రజలే చైతన్యవంతులై రాజ్యాంగాన్నీ, అన్ని సంస్థలనూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజల దృష్టి మళ్లించడానికి మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఒకే భాష, ఒకే దేశం, ఒకే మతం, ఒకే ఎన్నిక అంటూ ముందుకు తీసుకొచ్చి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. పర్యాటక కేంద్రాల వద్ద భద్రత ఎందుకులేదని ప్రశ్నించారు. ఆక్రమిత భూభాగాన్ని వెనక్కి తీసుకోకుండానే యుద్ధం ఎందుకు విరమించారని ప్రశ్నించారు. ట్రంప్ చేతుల్లో మోడీ ఇరుక్కుపోయారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెప్పాలన్నారు. పార్లమెంటు సభ్యుల కమిటీలు వేసి దేశాలు తిప్పితే ఏమొస్తుంది.. పార్లమెంటును సమావేశపరిచి దేశ ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని హితవు పలికారు. ప్రతిపక్షాలకు భయపడి పార్లమెంటు సమావేశం పెట్టడం లేదని విమర్శించారు.
మావోయిస్టులు కాల్పులు విరమించి ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెబుతున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మావోయిస్టులను చంపేస్తోం దని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కాల్చిచంపే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోని సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారన్నారు. కనీసం కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను వారి బంధువులకు ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్యన్నారు. హింస మంచిది కాదని, పోలీస్ బలగాలను వెనక్కి పిలిపించి, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ వస్తోందని, విత్తనాలు, ఎరువులు అందుబాటు లో ఉంచాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాగారపు పాండు, జిల్లా కమిటీ సభ్యులు భూక్య పాండు నాయక్, పల్లె వెంకటరెడ్డి, ఎస్‌కే యాకూబ్, వట్టెపు సైదులు, దుగ్గి బ్రహ్మం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను తదితరులు ఉన్నారు.
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES