మన నేల మన జాతి ఒకటే
అయితే మన బతుకులు ఒక్క తీరుగ ఎందుకు లెవ్వు ?
మన తల్లి ఒకటే అయితే
మాతృస్తన్యం మాకెందుకు
దొరకలేదు ?
అని సమైక్యాంధ్రను కోరుకుంటున్న తెలుగు ప్రజలను ప్రశ్నించే గొంతుక కలవాడు, “తెలుగు తల్లి మాకొద్దు తెలంగాణ తల్లి మాకు ముద్దు” అని పదునైన గొంతుకతో వ్యక్తపరచగల తెలంగాణ రైతు బిడ్డడు నందిని సిధారెడ్డి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా, ఉద్యమకారునిగా తన కలం, గళంతో ప్రయోగించిన భావజాలం పండిత పామరులపై తీవ్రమైన ప్రభావమే చూపింది. ప్రజలు అలుపెరుగని నిత్య పోరాటం చేస్తున్న సందర్భంలో…….
ట్యాంక్ బండ్ మీది
మనిషిని వెక్కిరించే
విగ్రహాలు విరిగిపడాలె
మనం పాడుతుంటే
సచివాలయం గేటు తాళాలు
ఊడిపడి స్వాగతం పలకాలె…
అంటూ అస్తిత్వాన్ని ప్రశ్నించే తీరుకు యువకులు, విద్యార్థులు ఇంకొంత ధైర్యాన్ని మూట కట్టుకోవడానికి నూరు శాతం సాయమయ్యింది.
ఈయన కలం నుంచి జాలువారిన “నా తెలంగాణ పాట” పల్లె పల్లెలో మారుమోగుతుంటే తెలంగాణ మొత్తం సమాజం, సంస్కృతి పురివిప్పి తాండవ మాడిందనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రకృతిని పూజించే బతుకమ్మ సంస్కృతి యావత్ ప్రపంచంలోనే ఎక్కడా లేదంటూ ……..
“బతుకమ్మ పండుగ
నా తెలంగాణ నా తెలంగాణ బంతిపూల తోట
నా తెలంగాణ నా తెలంగాణ”
అనే గేయం ద్వారా ప్రతి తల్లి త్యాగం, వీరుల త్యాగం, రైతుల శ్రమజీవనం వంటి వాటిని కలగలిపి వర్ణించిన ఫలితం రైతాంగ ఉద్యమాలకు, ప్రజా ఉద్యమాలకు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వెన్నుముకగా నిలిచి ఊపునిచ్చింది.
నందిని సిధారెడ్డి కలం సైతం స్త్రీవాదాన్ని శిఖరాయమానంగా గౌరవించిందని చెప్పడానికి మంజీరా నది ఏడుపాయలుగ చీలి అన్నార్తుల దాహం తీర్చినట్లు, తెలంగాణ ప్రతి స్త్రీ జీవన సారాంశం ఏడేడు జన్మల పీఠముడిగా స్త్రీత్వం, సహనత్వం, సహజత్వం, సహృదయత్వం, ప్రకృతి తత్వం, ప్రతిఘటనత్వం ఎదురు తిరిగితే పోరాట తత్వంగా ప్రణమిల్లినట్లు ఉంటుందని విషధీకరించిన కవితలు కోకొల్లలు.
మచ్చుకు కొన్ని………
మా మౌనాన్ని ఎప్పుడూ
ప్రమత్తతే అనుకుంటావ్ కానీ
గోడకు వేలాడే తుపాకీ కూడా మౌనంగా ఉంటుంది.
అంతేకాదు…….
పోరాటమే ఆమె బ్రతుకని
చావకుండా బ్రతకడం,
బ్రతకడం కోసం కష్టించడం
ఆమె తత్వమని……..
మౌనానికి ఉన్న బలాన్ని గౌరవించాడు.
బారెడు సదువన్న రాదాయె
సొంత సంఘాలు పెట్టుకోనీకి
ఎంత వలపోస్తే ఏం లాభం?
పొయ్యి అంటించకా తప్పదు
బియ్యం ఎక్కించకా తప్పదు
అంటూ అమ్మల బ్రతుకు జీవన చిత్రాన్ని వివరిస్తూనే………
ఎన్నో నాగరికతలు పండించిన గరుకైన చేతులు అమాయకంగా నవ్వుతుంటాయి/
నుదుటిమీద ఉదయించిన పొద్దు
చెమట నదిలో కరిగి నీరవుతుంది.
అంటూ అమ్మల పనితనాన్ని కీర్తించాడు.
గోదావరిలో కాళ్లు కడుక్కుంటున్నప్పుడు
ఆమెకి తెలవదు
తన కాళ్ళకిందే
పెద్ద గోదావరి దాగి ఉందని…..
అనే చిన్న కవితా పంక్తులతో ప్రతి తల్లి సహనాన్ని, స్థిరత్వాన్ని గోదావరితో పోలుస్తూ లోతైన వ్యాఖ్యానం చేసి తెలంగాణ తల్లికి కైమోడ్పులు చేశాడు.
మోట గొట్టే రాత్రి మోగిన పాట/తాడు పేనిన తండ్రి తలుపులున్నప్పు/కళ్ళ మూడ్చిన అవ్వ కలలోని గింజ/ఆరుగాలం చెమట నా తెలంగాణ నా తెలంగాణ/ఆత్మగళ్ళ చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ.
అని రైతు శ్రమజీవన చిత్రాన్ని, తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని నెత్తికెత్తుకున్న కవిత్వానుభవ శిఖరం నందిని సిధారెడ్డి.
ప్రజల కోసం ప్రజల చేత ప్రజల యొక్క అనే ప్రజాస్వామ్య నినాదాన్ని అనువణువునా జీర్ణించుకున్న నిఖార్సైన తెలంగాణా ప్రజల మనిషిగా భూమికోసం, బతుకు కోసం, రాష్ట్రం కోసం, రాజ్యం కోసం తెలంగాణ ప్రజలందరూ కలిసి కలలుగన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని హక్కుల కోసం బాధ్యతగా నిలబడాలని హితబోధ చేశాడు.
తుమ్మ వనం కాదు తంగేడు వనం నా తెలంగాణ, నా తెలంగాణ అని నిత్యం కలవరించే కవి, విద్యావేత్త “శ్రీ నందిని సిధారెడ్డి సాహిత్య సమాలోచన సదస్సు” సందర్భంగా..
– వ్యాసకర్త పోరెడ్డి మృదుల
సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నం



