Tuesday, May 20, 2025
Homeజాతీయంజాతి యావత్తూ సిగ్గుపడుతోంది

జాతి యావత్తూ సిగ్గుపడుతోంది

- Advertisement -

న్యూఢిల్లీ: కల్నల్‌ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్‌ మంత్రి కన్వర్‌ విజయ్‌ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ వ్యాఖ్యలను చూసి జాతి యావత్తూ సిగ్గుపడుతోందని సోమవారం వ్యాఖ్యానించింది. షా క్షమాపణలను తోసిపుచ్చింది. జరగబోయే పరిణామాలను తప్పించుకోవడానికే ఆయన క్షమాపణలు కోరారని తెలిపింది. షాపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు సుమోటోగా జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ విజయ్‌ షా దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌కే షాతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ విచారిస్తోంది.
‘పిటిషనర్‌కు ఆపాదించిన ప్రకటనలోని విషయాలను, ఆయన చెప్పినట్లుగా భావిస్తున్న క్షమాపణలోని విషయాలను పరిశీలించాము. మధ్యప్రదేశ్‌కు చెందని, నేరుగా నియమించబడిన ఆ రాష్ట్ర కేడర్‌కు చెందిన ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో ఏర్పాటు చేసే సిట్‌తో ఎఫ్‌ఐఆర్‌పై విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నదని మేము భావిస్తున్నాము’ అని బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ ముగ్గురిలో ఒకరు మహిళా ఐపీఎస్‌ అధికారి అయి ఉండాలని నిర్దేశించింది. మంగళవారం ఉదయం 10 గంటల లోగా సిట్‌ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్‌ డీజీపీని ఆదేశించింది. దీనికి ఐజీపీ హోదాకు తక్కువ కాని అధికారి నాయకత్వం వహించాలని, మిగిలిన ఇద్దరు సభ్యులు కూడా ఎస్పీ, ఆ పై స్థాయి నాయకులు అయి ఉండాలని తెలిపింది.
సిట్‌ దర్యాప్తునకు సహకరించాలని విజయ్‌ షాను సుప్రీం బెంచ్‌ ఆదేశించింది. దానికి లోబడి షా అరెస్ట్‌పై స్టే ఇచ్చింది. దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించబోదని, కానీ దర్యాప్తు నివేదికను సిట్‌ తమకు అందజేయాల్సి ఉంటుందని తెలిపింది. ‘మేము పర్యవేక్షిస్తామని చెప్పడం లేదు. కానీ నిశితంగా పరిశీలిస్తాం. కాబట్టి ఇది మీకు ఓ లిట్మస్‌ పరీక్ష’ అని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ దాఖలయ్యే పిటిషన్లను అనుమతించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్లను అనుమతించడం సమస్యను రాజకీయం చేస్తుందని జస్టిస్‌ కాంత్‌ అన్నారు. ‘తాను చేసిన దానికి సంబంధించిన పరిణామాలను ఆయన విధిగా ఎదుర్కోవాల్సిందే. అయితే చట్టాన్ని తన పని చేసుకోనివ్వండి. అందులో ఎవరైనా జోక్యం చేసుకోవడం మాకు ఇష్టం లేదు’ అని చెప్పారు. ఆదేశాలు జారీ చేసిన అనంతరం షా తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది మనీందర్‌ సింగ్‌తో ‘మేమేమీ వ్యాఖ్యానించదలచుకోలేదు. జాతి యావత్తూ సిగ్గు పడుతోంది. మనది చట్టాన్ని గౌరవించే దేశం. చిన్న వారైనా, పెద్ద వారైనా మేము అందరి విషయంలో ఒకే విధమైన నియమాలను పాటిస్తాము. న్యాయమూర్తులు ఎవరికి వ్యతిరేకంగా అయినా పక్షపాతం ప్రదర్శించరు. అందుకే ఎవరికీ హాని కలిగించవద్దని కోర్టు ఆదేశించింది’ అని బెంచ్‌ చెప్పింది. దర్యాప్తు నివేదికను ఈ నెల 28వ తేదీ నాటికి సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. మంత్రి క్షమాపణలు చెప్పారని మనీందర్‌ సింగ్‌ తెలుపగా ‘ఆ క్షమాపణ ఏమిటి? మేము మీకు ఆయన వీడియోను చూపించమంటారా? మీరు ఎలాంటి క్షమాపణ చెప్పారు? మీరు ఆలోచనా రహితంగా కఠినమైన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణ గురించి పదే పదే చెబుతున్నారు. నిజాయితీతో ప్రయత్నించకుండా మిమ్మల్ని ఎవరు నిరోధించారు?’ అంటూ జస్టిస్‌ కాంత్‌ ప్రశ్నలు సంధించారు. కోర్టు ముందు క్షమాపణలు చెప్పేందుకు షా సిద్ధంగా ఉన్నారని న్యాయవాది తెలుపగా మాకు అవి అవసరం లేదని బెంచ్‌ స్పష్టం చేసింది. ‘చట్ట ప్రకారం ఏం చేయాలో మాకు తెలుసు. మీరు కోర్టు ధిక్కరణకు పాల్పడి క్షమాపణలు చెప్పడం లేదు. ఏదో చేసి కోర్టు ముందుకు వస్తారు. క్షమాపణలు చెబుతాను అంటారు. ఇది సరైన వైఖరేనా?’ అని నిలదీశారు. ‘మీరు అనుభవజ్ఞుడైన ప్రజా నాయకుడు. మాట్లాడేటప్పుడు తూకం పాటించాలి. నిజానికి మేము మీ ప్రసంగ వీడియోను ప్రదర్శించాలి. మీరు మరింత వివేకంతో వ్యవహరించి ఉండాల్సింది. ఇది భావోద్వేగ భరితమైన సమస్య. ఏ సమయంలో మాట్లాడుతున్నామో చూడాలి. మనలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని షాకు జస్టిస్‌ కాంత్‌ చురకలు అంటించారు. క్షమాపణలు చెప్పేందుకు షా సిద్ధంగా ఉన్నారని న్యాయవాది పదే పదే చెప్పినప్పటికీ న్యాయమూర్తులు పట్టించుకోలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -