సర్వ ప్రక్రియలు
ప్రజా ఉద్యమం కోసమే
‘తెలకపల్లి రవి రచనలు’
ఆవిష్కరణ సభలో వక్తలు
అమరావతి : అభివృద్ధి నిరోధక, తిరోగామి శక్తులపై సాహిత్య రంగంలోనే తీవ్ర పోరాటం జరుగుతోందని ‘తెలకపల్లి రవి రచనలు’ ఆవిష్కరణ సభలో పాల్గొన్న పలువురు వక్తలు అన్నారు. విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో ప్రజాశక్తి బుక్ హౌస్ సంపాదకులు ఎంవిఎస్ శర్మ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రసంగించిన పలువురు ఆ మేరకు లెనిన్ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మన దేశంలో అదే పరిస్థితి కనపడుతోందని అన్నారు. దానిలో భాగంగానే తెలకపల్లి రవి సైతం తనకు ప్రావీణ్యమున్న సర్వప్రక్రియలను ప్రజా ఉద్యమాల కోసమే వినియోగించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలకపల్లి రవి రాసిన ఆశయపథం, అభద్ర, సజీవం, ప్రజాగానం, మీరే ప్రేరణ మీదే సాధనలతోపాటు ‘నేనెప్పుడూ కమ్యూనిజానికే సొంతం : ఆరుధ్ర’ సంకలనాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి ‘ఆశయ పథం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సాధారణంగా పత్రికా సంపాదకులు ఏదో ఒక అంశంపై నైపుణ్యం కలిగి ఉంటారని, తెలకపల్లి అనేక అంశాల్లో ప్రావీణ్యం సంపాదించారని చెప్పారు. సంపాదకుడిగా, కవిగా, రచయితగా, విమర్శకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా అన్ని అంశాల్లో నైపుణ్యం సాధించిన రవి ఆ నైపుణ్యాలన్నింటినీ ప్రజా ఉద్యమాలకే వినియోగించారని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిజం, ఉద్యమాల గురించి ఎంతో మంది రాశారని, రవి రాస్తే అందులో ఎంతో ప్రత్యేకత ఉంటుందని అన్నారు. ‘ప్రజాగానం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రజాశక్తి సంపాదకులు బి.తులసీదాస్ మాట్లాడుతూ.. ప్రజాగానంలో పాటలు అందరికీ సుపరిచి తమైనవని, వివిధ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఈ పాటలు వినిపిస్తుంటాయని అన్నారు. సాహితీ, రచన, వ్యాసం, ఉపన్యాసం రాజకీయం, అన్ని ప్రక్రియల్లో ప్రత్యేక నైపుణ్యం తెలకపల్లి రవికి ఉందని చెప్పారు. ‘అభద్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించిన నవ తెలంగాణ సంపాదకులు కె.ఆనందాచారి మాట్లాడుతూ, నిత్య చెతన్య, చలన శీలి తెలకపల్లి రవి అని పేర్కొన్నారు. అభద్రలో కథలు చైతన్యంగా ఉంటాయన్నారు. ఒక మహిళ అంతరం గాన్ని అద్భుతంగా విష్కరించారని తెలిపారు. సాక్షి, భవనం, మంచి మామిడి, ఆకలి ఏడ్చింది, కరువు కథల దృశ్య చిత్రీకరణలను ఆయన ప్రస్తావించారు. ‘మీరే ప్రేరణ – మీదే సాధన’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గొళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. సమాజం వల్ల వ్యక్తులు మారతారా లేక వ్యక్తుల వల్ల సమాజం మారుతుందా అంటే సందర్భాన్ని బట్టీ జరుగుతుందన్న అంశాన్ని ఈ పుస్తకంలో వివరించారని చెప్పారు. ‘సజీవం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సాహితీ స్రవంతి అధ్యక్షులు కెంగార మోహన్ మాట్లాడుతూ, సమకాలీన సమస్యలను ప్రస్తావించేలా ఈ కవిత్వం ఉందన్నారు. మనిషి మనస్త త్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారన్నారు. ‘నేనెప్పుడూ కమ్యూనిజానికే సొంతం’ – ఆరుద్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సాహితీ ప్రస్తానం వర్కింగ్ ఎడిటర్ సత్యాజీ మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని చదివితే ఆరుద్రకు తెలకపల్లి రవి చాలా దగ్గరగా ఉన్నట్లు అర్ధమవుతుందన్నారు. ప్రజాశక్తి, కమ్యూనిష్టు పార్టీ చరిత్ర చదువుతున్నట్లుగా అనిపిస్తోందని తెలిపారు. పుస్తకంలో ఆరుద్ర సతీమణి రామలక్ష్మి ఇంటర్వ్యూను ప్రచురించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రజాశక్తి బుక్ హౌస్ ఎడిటర్ ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ.. దీర్ఘ కాలం ఉద్యమాల్లో కలిసి నడిచిన తెలకపల్లి రవి ఉద్యమానికి ఎప్పుడు ఏది అవసరమో గుర్తించి ఆ రచనలు చేసి అందించేవారని చెప్పారు. సాహిత్యలోకం ఈ పుస్త కాలు చదివి స్పందించాలనే ఉద్దేశంతో ఒకే సారి 6 పుస్త కాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఇంకా 60 పుస్తకాలు రావాల్సినవి ఉన్నాయని చెప్పారు. అనంతరం ఈ పుస్తకాల రచయిత, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, తెలకపల్లి రవి మాట్లాడుతూ, సాహితీ రంగంలో ప్రస్తుతం జరుగుతున్న పోరాటాన్ని మరింత తీవ్రం చేయాల్సిఉం దన్నారు.
గత సినిమాల్లో దైవాన్ని మానవీకరించడం చూశామని, ప్రస్తుతం మానవుడి గాధల్ని దైవీకరి స్తున్నారని, ఇది నవీన పురాణంగా పేర్కొన్నారు. ఈ పుస్త కాలు, ఇంకా రాబోయే అనేక రచనలు, కవిత్వాలు, పాటలు అన్ని కూడా ఒక పునర్వికాసానికి, పునః ప్రస్తానానికి దారితీస్తే సంతోషిస్తానని చెప్పారు. దానికోసం ఒక క్రమపద్దతిలో ఈ పుస్తకాలను తీర్చిదిద్ది తీసుకువస్తానని చెప్పారు. సజీవం 2 కవితా సంపుటిని త్వరలోనే తీసుకు వస్తానన్నారు. ఈ సందర్భంగా ప్రజాగానం పుస్తకంలో పలు పాటలను ప్రజానాట్యమండలి సీనియర్ గాయకులు జగన్ ఆలపిం చారు. ఈ పాటలను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ప్రజా గానం కాదు రవి కిరణాలుగా ఉన్నాయని పేర్కొన్నారు.