– పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరపాలి
– పహల్గాంలో దాడి, ఆపరేషన్ సిందూర్‌ను దేశ ప్రజలకు వివరించాలి
– ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయాలి
– పాకిస్తాన్‌పై కేంద్రం ఒత్తిడి పెంచాలి
– కాల్పుల విరమణను ట్రంప్ ప్రకటించడం అభ్యంతరకరం
– పార్టీ సొంత బలం పెంచుకోవడంపై దృష్టిసారిస్తాం
– జాతీయస్థాయి వరకే ఇండియా బ్లాక్
– రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు
– కేరళలో మళ్లీ ఎల్డీఎఫ్ గెలుస్తుంది : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి, 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం, ఆపరేషన్ సిందూర్ వంటి అంశాల గురించి వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను జరపాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో నిర్వహించారు. గురు, శుక్రవారాల్లో రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతాయి. గతనెల రెండు నుంచి ఆరో తేదీ వరకు తమిళనాడులోని మధురైలో ఆ పార్టీ అఖిల భారత మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఎంఏ బేబీ తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చారు. ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఎ విజయరాఘవన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో కలిసి ఎంఏ బేబీ మీడియాతో మాట్లాడారు. పార్టీ మహాసభల్లో రాజకీయ, సంస్థాగత లక్ష్యాలను నిర్దేశించుకున్నామని అన్నారు. వామపక్ష, ప్రజాతంత్ర పార్టీలు, సామాజిక శక్తులను ఐక్యం చేసి ముందుకెళ్తున్నామని చెప్పారు. పార్టీ సొంత బలం పెంచుకోవడంపై దృష్టిసారించామన్నారు. ఇటీవల పార్టీ కేంద్ర కమిటీ సమావేశం జరిగిందనీ, మహాసభలో చేసిన నిర్ణయాలను నిర్దిష్ట కాలపరిమితిలోగా అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. గతనెల 22న పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను కాపాడే ప్రయత్నంలో ఓ కాశ్మీరీ కూడా బలయ్యాడని అన్నారు. ఉగ్రవాదుల దాడిని దేశం, ప్రజలు, రాజకీయ పార్టీలన్నీ ఖండించాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాయన్నారు. ఉగ్రవాదులను అణచివేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్‌ను త్రివిధ దళాలు చేపట్టాయని అన్నారు. ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలపై యప సైన్యం దాడి చేసిందన్నారు. ఆ తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారనీ, ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందంటూ ప్రకటించారని అన్నారు. ఆర్మీయేతర చర్యలు చేపట్టాలంటూ సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత జాన్‌బ్రిట్టాస్ కేంద్రాన్ని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. న్యాయపరంగా ఎదుర్కొనే చర్యలు చేపట్టాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయి వేదికల్లో పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. జాతినుద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ ఆర్మీని అభినందించారని అన్నారు. ఆ తర్వాత కాల్పుల విరమణ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి అనేక విషయాలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మతకలహాలు రెచ్చగొట్టేలా సైబర్ దాడి
ఎల్రక్టానిక్ మీడియా టీఆర్పీ పోటీ ప్రపంచంలో ఉందని ఎంఏ బేబీ అన్నారు. ఇండియా-పాకిస్తాన్ యుద్ధ సమయంలో మతకలహాలు రెచ్చగొట్టేలా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించాయని విమర్శించారు. ప్రజలంతా ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటివి ప్రసారం చేయడం సరైంది కాదన్నారు. కేరళకు చెందిన ఉగ్రదాడి బాధితుడు రామచంద్రన్ కుమార్తె ఆరతి చెప్పిన విషయాలను ఆయన గుర్తు చేశారు. ఇద్దరు ముస్లిం సోదరులు వారికి అన్ని విధాలుగా సహాయం చేశారనీ, మతకలహాలు రెచ్చగొట్టేలా కొందరు సైబర్ దాడులకు పాల్పడ్డారని అన్నారు. ఒలింపిక్స్ జావెలింగ్ త్రో విజేత నీరజ్‌చోప్రాపైనా సైబర్ దాడులు జరిగాయన్నారు. పార్లమెంటు సభ్యులకు అనేక ప్రశ్నలుంటాయనీ, వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంఏ బేబీ సమాధానమిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ పనిచేసిందనీ, బీజేపీ మెజార్టీ తగ్గిందని వివరించారు. ఇండియా బ్లాక్ జాతీయ స్థాయిలోనే పనిచేస్తుందనీ, రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలుంటాయని అన్నారు. బీహార్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని వివరించారు. ఆ రాష్ట్ర్ర ఇంచార్జీగా విజయరాఘవన్ ఉన్నారనీ, ఆర్జేడీతో సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు. అఖిలపక్ష సమావేశానికి ఢిల్లీలోనే ఉన్నా ప్రధాని మోడీ ఎందుకు రాలేదనే దానిపై తాను రాజకీయ విమర్శలు చేయదల్చుకోలేదని చెప్పారు. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయని వివరించారు. కేరళలో ఎల్డీఎఫ్ మళ్లీ గెలుస్తుందన్న నమ్మకముందన్నారు. ఐదేండ్లకోసారి కేరళలో ప్రభుత్వం మారుతుందనీ, కానీ ఎల్డీఎఫ్ ప్రభుత్వం రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించిందని చెప్పారు. ఇక ముందు కూడా ఎల్డీఎఫ్ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుందనీ, అందుకోసం వామపక్ష శ్రేణులు కృషి చేస్తున్నాయని అన్నారు.
మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి : బివి రాఘవులు
ఆపరేషన్ సిందూర్ తాత్కాలికంగా ముగిసిందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్పారు. ఇదే సమయంలో ఆపరేషన్ కగార్‌ను కూడా కేంద్రం నిలిపేసిందనీ, ఇది మంచి పరిణామమని అన్నారు. దానికి కొనసాగింపుగా మావోయిస్టులతో చర్చలు జరిపాలని కోరారు. చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టులు ప్రకటించారని గుర్తు చేశారు. సాయుధ చర్యలను నిలిపేస్తామంటూ ప్రకటించారనీ, చర్చలకు ఇది సానుకూల వాతావరణమని అన్నారు. శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం షరతుల్లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాల్సిందే
– డబ్బుల్లేవంటూ తప్పించుకునే సమాధానం తగదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఎన్నికల ముందు ప్రజలు, ఉద్యోగులకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాల్సిందేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీల అమలు గురించి అడిగితే డబ్బుల్లేవంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పించుకునే సమాధానం చెప్తున్నారని అన్నారు. ఆరు గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల ముందు వాగ్ధానాలు ఇచ్చినపుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా?అని ప్రశ్నించారు. అధికారం కోసం వాగ్ధానాలు ఇస్తాం, తర్వాత తప్పించుకుంటామంటే కుదరదని అన్నారు. వాటిని అమలు చేయకుంటే ప్రజలు ఉద్యమంలోకి వస్తారనీ, ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కరాచీ బేకరీపై మతోన్మాద అరాచక శక్తులు దాడి చేశాయన్నారు. ఆ పేరును మార్చుకోవాలంటూ కోరుతున్నాయని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమై పోరాడుతుంటే ఇలాంటి మతోన్మాద అరాచక శక్తులు ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరాచకాలను అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. నిజామాబాద్‌లో వీడీసీలు రజకులు, గౌడ కులస్తులను ఇటీవల సాంఘిక బహిష్కరణ చేశాయన్నారు. వీడీసీలపై చర్యలు తీసుకోకుంటే ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నిజాలు తెలియాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES