నవతెలంగాణ-హైదరాబాద్ : బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద గోదావరి వేగంగా పెరుగుతుంది. గోదావరి ఉపనదులు ఇంద్రావతి, ప్రాణహిత కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి గంటగంటకు పెరుగుతుంది. గురువారం ఉదయం 4 గంటలకు 29 అడుగులు ఉన్న గోదావరి, 9 గంటలకు 35.90 అడుగులకు పెరిగింది. ఎగువనున్న రామగుండంలో గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక 73.32 అడుగులకు చేరి ప్రవహిస్తుంది. అలాగే సమ్మక్క సాగర్ బేరేజ్ కు 5,20,630 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో బేరేజ్ 59 గేట్లు ఎత్తి 5,20,383 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఉదయం 9 గంటలకు 37,594 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో 24 గేట్లు ఎత్తి 40,400 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి వదులుతున్నారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు 5 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో ఒక గేట్ ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువనున్న కిన్నెరసాని నదిలోకి వదులుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా 84 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు తరలి వస్తుండటంతో గురువారం సాయంత్రానికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.