సినిమాలు కేవలం వినోదాన్నే కాదు స్ఫూర్తినీ కలిగిస్తాయని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో నిరూపిత మైంది. ఆ కోవలోకి వచ్చే సినిమానే ‘స్థానర్ధి శ్రీకుట్టన్’.
ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు కేరళ స్కూళ్ల ముఖ చిత్రమే మారిపోయింది. ఇది ఎంతగా ప్రభావితం చేసిందంటే కేరళలో ఇప్పుడు చాలా స్కూల్స్‌లో బ్యాక్ బెంచీలు లేవు. అందరూ సమానమేననే సందేశం చాటేలా యు షేప్‌లో బెంచీలు వేయించి ఒకరికొకరు సులభంగా కనిపించేలా మార్పు చేయించారు. ఇది చాలా గొప్ప ఫలితాన్ని ఇచ్చి పిల్లల మధ్య భేదాలు తగ్గిస్తోందని పలువురు ఉపాధ్యాయులు స్వయంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియజేయటం విశేషం. కొత్త దర్శకుడు వినేష్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ మలయాళ సినిమా మొత్తం స్కూల్ పిల్లల చుట్టూ తిరుగుతుంది. శ్రీ కుట్టన్ అనే ఏడో తరగతి కుర్రాడు బ్యాక్ బెంచర్. చదువులో వెనుకబడి
ఎప్పుడు ఫ్రెండ్స్, గ్యాంగ్‌ని వేసుకుని అల్లరి చేస్తూ ఉంటాడు. పక్క తరగతి వాళ్ళతో గొడవ, ఇష్టపడిన క్లాస్ మేట్, అందరూ తిట్టుకునే ఒక మాస్టర్ ఇలా వీళ్లందరి మధ్య ఊహించని ఒక సమస్య వస్తుంది. అదేంటి, ఎలా తీర్చుకున్నారనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. సింపుల్‌గా అనిపించే లైన్‌తో దర్శకుడు చాలా మంచి ఎమోషన్లను చూపించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పిల్లలు అన్ని విషయాల్లోనూ సమానమే అనే విషయాన్ని బలంగా చెబుతూ ఈ దర్శకుడు చేసిన ప్రయత్నం అందర్నీ ఆలోచించేలా చేసింది. విద్యార్థుల్లో అసమానతలు తొలగించే రీతిలో కేరళ స్కూల్స్‌లో వచ్చిన విప్లవాత్మక మార్పు దేశ వ్యాప్తంగా విస్తరించాలని ఆశిద్దాం. అలాగే ఇలాంటి స్ఫూర్తిదాయక చిత్రాలను ప్రజలకు మరింత చేరువ చేసే బాధ్యతతోపాటు వాటిని ప్రోత్సహించేలా పరిశ్రమ, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
– రెడ్డి హనుమంతరావు
కేరళ స్కూల్స్‌లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన చిత్రం
- Advertisement -
- Advertisement -