నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటి(సోమవారం)తో ముగిసింది. డిసెంబర్ 11న తొలి విడత, 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తుది విడత ఎలక్షన్ డిసెంబర్ 17న జరగనుంది. దీంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగిసింది. డిసెంబర్ 17న 182 మండలాలు 4157 గ్రామ పంచాయతీలు,28, 406 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. తుది విడతలో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 53 లక్షల 6వేల 401 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 26 లక్షల 1861 పురుష ఓటర్లు, 27 లక్షల 4 వేల 394 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలానే146 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.
తుది విడత పంచాయతీ ఎన్నికల కోసం 36 వేల 483 పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇవాళ(సోమవారం) సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎల్లుండి(బుధవారం) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తుది విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది.



