ప్రతిభకు పదును పెట్టాలి..
నవతెలంగాణ – కొల్లాపూర్
దేశ భవిష్యత్తు నవతరం, యువతరం చేతుల్లోనే ఉందని, తమ ప్రతిభకు పదును పెట్టి ఉద్యోగాలతో పాటు అనేక రంగాల్లో రాణించాలని, శ్రీ గాయత్రి విద్యా సంస్థల అధినేత సురగౌని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం భారత మాజీ రాష్ర్టపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి ప్రిన్సిపాల్ గోపాల్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహాదేవి డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకకు శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం లాంటి గొప్ప మేధాసంపతి గల వారిని నేటి తరం యువత స్ఫూర్తిగా ఎంచుకోవాలి.
యువతరం గళం ఎత్తితేనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందని గుర్తు చేశారు. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించేలా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. యువత తమ స్కిల్స్ ఉపయోగించి దేశ పునర్నిర్మాణానికి అవసరమైన మేధోసంపత్తిని పెంపొందించుకోవాలన్నారు.
ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాలని, అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు. అనంతరం మహాదేవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గోపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు స్నేహ పూర్వక వాతావ రణంలో మెలగి ఉన్నత స్థితికి ఎదగాలన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.