– వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలి
– అమ్మాయిలకు శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా ఇవ్వాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సదస్సులో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలో, రాష్ట్రంలో అమ్మాయిలపై లైంగిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. బేటి బచావో, బేటి పడావో అని చెప్పే ప్రధాని మోడీ ఈ దేశంలో గంటకి కొన్ని వేల లైంగిక దాడులు, యాసిడ్ దాడులు జరుగుతున్నా స్పందించడం లేదన్నారు. సమాజంలో వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు. అసమానతల్లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని కోరారు. గతంలో అమ్మాయిలకు హాస్టల్, పాఠశాలలు, కాలేజీల్లో శానిటరీ నాప్కిన్స్‌ను ఉచితంగా ఇచ్చేవారని గుర్తు చేశారు. దాన్ని పునరుద్ధరిం చాలని కోరారు. శనివారం హైదరాబాద్ నగర సీఐటీయూ కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం మమత అధ్యక్షతన విద్యార్థినిల రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ శానిటరీ నాప్కిన్స్‌పైన జీఎస్టీని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీల్లో అమ్మాయిలకు సరైన సదుపాయాల్లేక సరిపడా గదులు, మరుగుదొడ్లు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ, వసతులను మెరుగుపర్చాలని కోరారు. అమ్మాయిలు సరైన ఆహారం తీసుకోక అనారోగ్యం బారిన పడుతున్నారనీ, రక్తహీనతకు గురవుతున్నరని ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మాయిలకు పౌష్టికాహారం అందించాలని డిమాండ్ చేశారు. మెస్ చార్జీలను ధరలకను గుణంగా పెంచాలని కోరారు. విద్యార్థులందరూ మహనీయుల చరిత్రలు తెలుసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు.
సోషల్ మీడియాలో వస్తున్న ఆశ్లీలం, ద్వంద్వర్థాలు వచ్చే వీడియోలు, డ్రగ్స్, గంజాయి, మద్యం, సిగరెట్ లాంటి సంస్కృతి విద్యార్థినీల్లో కూడా ప్రభావం చూపుతున్నదని అన్నారు. వాటికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాల న్నారు. ప్రభుత్వాలు మహిళల విద్యకు నిధులు కేటాయించి, బాలికల వసతిగృహాలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ సదస్సులో విద్యార్ధినిల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సంబంధించిన ప్రణాళికను రాష్ట్ర కన్వీనర్ ఎం పూజ ప్రవేశ పెట్టారు. ఈ సదస్సులో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రజనీకాంత్, టి నాగరాజు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దీపికా, రాష్ట్ర కమిటీ సభ్యులు రమ్య, సుమ, కార్తీక్, రమేష్, అవినాష్, నిక్షిప్త, జ్ఞాపిక, శివాని, కీర్తన, వసంత, రత్నవేణి, హేమలత, శివాని తదితరులు పాల్గొన్నారు.
అసమానతల్లేని సమాజమే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES