– ఉపాధి కూలీలకు రూ.40 వేతనం ఏమిటి?
– వేసవి అలవెన్స్ పునరుద్ధరించాలి
– మంచాల మండలం ఎల్లమ్మతండాలో సీపీఐ(ఎం) బృందం పర్యటన
– కనీస వసతుల్లేవంటూ గోడు చెప్పుకున్న కూలీలు
– వారి సమస్యలపై 30న చలో కలెక్టరేట్‌కు పిలుపు
– కూలీలకు పెండింగ్ బిల్లులు, ఉద్యోగులకు వేతనాలివ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి, మంచాల
ఉపాధి కూలీలను ప్రభుత్వాలు శ్రమ దోపిడీ చేస్తున్నాయని, పొద్దంతా పని చేయించి రూ.40 ఇవ్వడం ఏమిటనీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం రూ.307 చెల్లించాల్సి ఉందని, కొలతల విధానంతో ప్రభు త్వాలు ఉపాధి కూలీలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మంచాల మండలంలోని ఎల్లమ్మతండాలో జాన్‌వెస్లీ ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) బృందం పర్యటించి ఉపాధి హామీ పనులను పరిశీలించింది. పని జరుగుతున్న తీరును తెలుసుకుని, కూలీల సమస్యలపై ఆరా తీసింది. ఈ సందర్భం గా కూలీలతో జాన్‌వెస్లీ ముఖాముఖి నిర్వహించారు.. ‘దినసరి కూలీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ. 307 వస్తున్నాయా అని కూలీలను అడగ్గా.. రోజుకు కేవలం రూ.40 మాత్రమే వస్తున్నాయని కూలీలు చెప్పారు. ‘ఇంత ఎండలో పనిచేస్తు న్నారు.. కనీసం నిలబడటానికి నీడ కూడా లేదు.. ప్రభుత్వం మీకు ఇచ్చిన టెంటు ఎక్కడ పోయింది’ అని అడగ్గా.. ఇప్పటి వరకు తమకు టెంటు లేదు సారూ.. కనీసం తాగడానికి నీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి తెచ్చుకుం టున్న బాటిల్స్ నీటితోనే గొంతు తడుపుకుంటున్నామని చెప్పారు. ‘గట్టి నేలలు తవ్వితే పెళ్లకూడా బయటికి వస్తలేదని.. కొలతల ప్రకారం కూలి అంటే గీ గుట్టల్లో ఎట్లా అవుతుంది’ అంటూ తమ గోడును సీపీఐ(ఎం) బృందం ఎదుట కూలీలు వెల్లబోసుకున్నారు. దీనికి సీపీఐ(ఎం) నాయకులు స్పందిస్తూ.. కూలీలకు అండగా ఉంటామన్నారు. వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ ప్రభుత్వాలతో పోరాడుతామని కూలీలకు భరోసానిచ్చారు.
అనంతరం జాన్‌వెస్లీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ కొలతలతో సంబంధం లేకుండా కూలీలకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొలతలే ప్రామాణికం అనుకుంటే వేసవి కాలంలో గట్టినేలల్లో గుంతలు కొట్టుడు, కట్టలు పోసుడు పనులకు ప్రత్యామ్నాయం చూపాలన్నారు. కూలీలకు కచ్చితంగా ఉపాధి చట్టం ప్రకారం దినసరి కూలి రూ.307 ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. వేసవి అలవెన్స్‌లు నిలిపివేయడం సరైంది కాదని, తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పునరుద్ధరిం చాలని డిమాండ్ చేశారు.. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తోందన్నారు. దీనికి నిదర్శనమే ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.86 లక్షల కోట్లతో సరి పెట్టిందన్నారు. రాష్ట్రంలో ‘ఉపాధి’ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలను సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. సుమారు 3,200 మంది ఉద్యోగులకు వేతనాలందక సతమతం అవుతున్నా రన్నారు. కూలీలకు వారాల కొద్దీ వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో ఆ కుటుంబాల జీవనం కష్టతరంగా మారుతోందన్నారు. ప్రభుత్వం ఉపాధి కూలీలకు ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా దినసరి వేతనం రూ.600 ఇవ్వాలని, ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. కూలీల సమస్యలపై ఈ నెల 30న చేపట్టనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమంలో కూలీలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్, డి.జగదీష్, ఇ.నర్సింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.అంజయ్య, కందుకూరి జగన్, పార్టీ మంచాల మండల కార్యదర్శి రావుల జంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి శ్రీనివాస్‌రెడ్డి, నాగిల్ల శ్యామ్ సుందర్, పి.జగన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వానిది శ్రమదోపిడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES