అనగనగా అదొక ఊరు. ఆ ఊరిలో రకరకాల మనుషులు కలసి మెలసి జీవించేవారు. చాలాకాలం పాటు ఆ ఊరికి ఒక వ్యక్తి రాజుగా ఉన్నాడు. ఆ రాజు తనకు చేతనైంత రీతిలో పరిపాలన చేసేవాడు.
అన్ని ఊళ్లకి పొరుగూళ్లు ఉన్నట్లే ఆ ఊరికి కూడా పొరుగూళ్లు ఉన్నాయి. అందులో ఒక ఊరిలో ఎక్కువగా దొంగల పరిపాలన జరుగుతుండేది. ఆ దొంగపాలకులు తరుచూ ఈ ఊరి మీదపడి దొంగతనం చేస్తాం! అని బెదిరిస్తుండే వారు. కానీ, దొంగతనానికి దిగి, దొంగతనం చేసింది చాలా తక్కువ. ఏదేమైనా దొంగల పాలన సాగేది గనక ఆ ఊరిని దొంగల ఊరు అని పిలిచేవారు!
ఇక ఈఊర్లో కొందరు చాలాకాలంగా ఎన్నికై పాలన చేస్తున్న రాజుని ఎలాగైనా ఓడించాలని ప్రయత్ని స్తున్నారు. కాని వీలు కావటం లేదు. అందువల్ల కొత్తదారి వెతుక్కున్నారు. ఆ ఊర్లోని రకరకాల మనుషుల మధ్య గొడవలు పెట్టారు! అంతేకాక పక్కనున్న దొంగల ఊరి నుండి పెను ప్రమాదం పొంచి ఉందని, ఆ ఊరు మన ఊరి మీద దాడి చేసి, మన ఊరిని నామరూపాలు లేకుండా చేస్తుందని, అందుకు దొంగల ఊరిని ఓడించే మొనగాడిని రాజుగా ఎన్నుకోవాలని, అలాంటి మొనగాడు 56 ఇంచుల ఛాతీగలవాడు తమ వద్ద ఉన్నాడని, ఆయన్నే ఆ ఊరికి రాజు ఎన్నుకోవాలని ప్రచారం చేశారు. దాంతో ప్రజలు పాత రాజును ఓడించి కొండంత నమ్మకంతో ఈ 56 ఇంచుల ఛాతీ గల వ్యక్తిని రాజును చేశారు. ఆ రాజు ఎంతో వినమ్రంగా, తాను ఆ ఊరికి కాపలాదారుగా ఉంటానని ప్రజలకు వాగ్దానం చేశాడు. ప్రజలు ఎంతో ఆనందపడ్డారు.
ఆ తర్వాత ఆ ఊర్లో చెలామణిలో ఉన్న డబ్బును రాజు రద్దు చేశాడు. ”మన ఊర్లోని డబ్బును పక్క దొంగల ఊరి వారు ఎత్తుకొనిపోయి నకిలీ డబ్బును తయారు చేస్తున్నారు! మనం కొత్తగా డబ్బును తయారు చేసుకుందాం! అప్పుడు దొంగల దిక్కుతోచక చస్తారు!” అని రాజు ప్రకటించాడు.
చాలా కష్ట,నష్టాలు వచ్చినా, పాత డబ్బులు చెల్లక ప్రాణాలే పోయినా, రాజు మాటను ప్రజలు అన్నీ సహించారు! పక్క దొంగల ఊర్లోని కొందరు, ఈ ఊరి చివరిలో కావలి కాస్తున్న కొందరు భటులను కాల్చి చంపారు! అంతకుముందు ఆ దొంగలు పొలిమెర వరకు మాత్రమే వచ్చేవారు. కాని రాజు కాపలాదారయ్యాక ఏకంగా ఊర్లోకి వచ్చి భటులనే ఎలా కాల్చిచంపారో ప్రజలకు అంతపట్టలేదు! కాని రాజు గర్జించాడు. దొంగల అంతు తేలుస్తానని శపథం చేశాడు. పొద్దునే రచ్చబండ వద్ద చాటింపు వేస్తున్నారు. ”మన రాజుగారు’ పక్కనున్న దొంగల ఊరిపై అర్ధరాత్రి మెరుపుదాడి చేయించారు. వారు కోలుకోలేని నష్టం జరిగింది! ఇక మనవైపు కన్నెత్తి కూడా చూడలేరు!”
మైకంలోకి వెళ్లిన ప్రజలు రాజును మరోసారి గెలిపించారు!
కొంతకాలం గడిచింది. దొంగల ఊరికి చేవ చచ్చిందని, ఆఊరి జనం ఆడుక్కుతింటున్నారని, వంది మాగధులు ప్రచారం చేస్తూనే ఉన్నారు!
ఊర్లోకి కొందరు చుట్టాలు వచ్చారు! తమ ఇంటికి వచ్చిన చుట్టాలకి తమ ఊళ్లోని తోటను చూసి రమ్మని పంపించారు ఆ గ్రామస్తులు! ఆ తోటలో వారు తిరుగుతుండగానే, మరోసారి పక్క ఊరిదొంగలు వారి మీద విరుచుకు పడ్డారు. ఒక్కొక్కరిని నిలబబెట్టి కాల్చి చంపేశారు. సరిగ్గా అదే సమయానికి రాజుగారు విదేశాల్లో ఉన్నారు! వెంటనే పర్యటనను రద్దు చేసుకుని తిరిగివచ్చారు! కాని తోటకు వెళ్లలేదు! కనీసం చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించలేదు! వారికి మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు! నేరుగా ”రచ్చబండ వద్దకు వెళ్లి దొంగల ఊరి సంగతి తేలుస్తా! వారికి మంచినీళ్లు కూడా పుట్టకుండా చేస్తా!” అంటూ వీరోచిత ఉపన్యాసం ఇచ్చాడు.
ఊరి జనం, వంధి మాగధులు రెచ్చిపోయి చప్పట్లు కొట్టారు! మహారాజుకి జయజయ ధ్యానాలు చేశారు!
ఒక్క పేదరాసి పెద్దమ్మ మాత్రం చప్పట్లు కొట్టలేదు! జయ జయధ్వానాలు చేయలేదు! పైగా కోపంతో చూస్తోంది!
”ఏమే ముసిలిదానా! రాజు ఆ దొంగల అంతు చూస్తానంటే
నీ మొహంలో సంతోషం కనబడటం లేదు! ఏం సంగతి?” ఆని ప్రశ్నించాడు! ఒక మాగధుడు.
”ఏమో నాయనా, పాతరాజు ఉన్నపుడు పక్కఊరి దొంగలు దొంగతనం మాత్రమే చేసేవారు! మీ మాటలు నమ్మి, ఈయనను రాజుని చేస్తిమి! అదేమి విచిత్రమో అప్పటినుండి ఆ దొంగల దారుణాలు పెరిగిపోయాయి! ఏకంగా ఊర్లోకి చొరబడి కాల్చి చంపుతున్నారు! అట్లా జరిగిన ప్రతిసారి మన రాజేమో ఊర్లో ఉండటం లేదు! అంతా అయిపోయాక వచ్చి వీరాలాపనలు చేస్తున్నాడు! వాళ్ల అంతు తేలుస్తా అంటున్నాడు! కాని కొంతకాలం గడిచాక దొంగల దాడి జరుగుతూనే ఉంది. ప్రాణాలు పోతూనే ఉన్నాయి! రాజన్నవాడు మాటలు చెప్పటం కాదు! చేతల్లో చూపాలి!.” అన్నది పెద్దమ్మ,
”ఆ దొంగలను అదుపులో పెట్టడానికి, పాత డబ్బు రద్దు చేశాం! మెరుపుదాడి చేశాము!” అన్నాడొక వంది.
”మీరు చేసిన పనుల వల్ల ఆ దొంగలకు నష్టమో, కష్టమో జరిగి ఉంటే మన జోలికి వచ్చేవారేకాదు! రాజు విదేశాలకు వెళ్లటం, ఆ దొంగలు వచ్చి దాడి చేయటం, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నట్లుంది! మన రాజుకి 56 ఇంచుల ఛాతీ ఉంది కదా! ఎన్నో తెలివితేటలున్న మంత్రులు, అనితరసాధ్యమైన శక్తి గల గూఢాచారులున్నారు కదా! లక్షల సైన్యం ఉంది కదా! అయినా ఆ దొంగలు మన ఊరి మధ్యలోకి ఎలా వస్తున్నారు? వారు అన్నేసి తుపాకులు పట్టుకువస్తుంటే మన గుఢాచారులు వారిని ఎందుకు పసిగట్ట లేకపోతున్నారు? మనరాజు అంటే పక్క ఊరి దొంగలకు భయమే ఉంటే ఇదంతా జరుగుతుందా?” అని ప్రశ్నించింది పెద్దమ్మ. ”రాజునే ప్రశ్నిస్తావా? నీవు ఈ ఊరికి ద్రోహం చేస్తున్నావు!” అంటూ పెద్దమ్మను ఖైదు చేశారు రాజభటులు.
ఊరికి మొనగాడు
- Advertisement -
RELATED ARTICLES