Tuesday, April 29, 2025
Navatelangana
Homeఎడిట్ పేజికాశ్మీర హృదయం

కాశ్మీర హృదయం

- Advertisement -

ముళ్లను అంటుకునే పరిమళం ఉన్నట్టు, చీకటిని చీల్చుకుని వెలుతురు వికసించినట్టు, రాక్షసత్వం నశించి మానవత్వం జయిస్తుంది. మానవత్వం నిండిన మనిషే నిలుస్తాడు. ”ఓహో! మానవుడా! అన్యాయం భరించలేని వాడా! విహ్వలుడా! వీరుడా! ప్రేమించేవాడా! ఆదర్శజీవీ! మహాత్మా! మానవుడా” అని శ్రీశ్రీ పాడుకున్నట్టు, మానవుడు నిలుస్తాడు గెలుస్తాడు. హృదయాలనెన్నో గెలుచుకుంటాడు. మనిషి గుండెలో లోలోపల ఎక్కడో.. మానవీయ మానవుడు మేలుకొనే ఉంటాడు. వాడిని నిదురింపజేసి, నిదురపుచ్చి, మత్తునిచ్చి, మతమునో, గతమునో, కులమునో, ప్రాంతమునో, ఏదో ఒకటి నింపి ఉన్మాదాన్ని మేల్‌కొలుపుతుంటారు. వేల ఏండ్లుగా జరుగుతున్నదిదే. స్వార్థ ప్రయోజనాల కోసం ఈ తంత్రం సాగుతోంది. మనుషుల హననం జరుగుతోంది. ఇప్పుడు కాశ్మీర్‌లో జరిగిందీ అదే. కల్లు తెరచి రెండోవైపు చూస్తే వెల్లివిరిసిన మానవత్వం కళ్లనిండా పరుచుకుంటుంది. ఉగ్రదాడిలో ఇరవై ఎని మిది మంది ప్రాణాలు కోల్పోవటం, దుండగులు అత్యంత కిరాతకంగా వ్యవహరించడం ప్రపంచంలోని మను షులం దరికీ బాధ కలిగించింది. ఈ దుర్మార్గం వెనుక ఉన్న దేశాలు, రాజకీయాలు, పోషణలు, వ్యూహాలు, ఉన్మాదాలు అటుం చితే మానవీయ కోణాలను పరిశీలించాలి. ప్రేరణ పొందాలి. మన హృదయాలను సరిచేసుకోవాలి. యుద్ధం, ఉగ్రవాదం,మతోన్మాదం, అది ఎవరిదైనా ఎక్కడున్నా, ఎప్పుడైనా మానవ విధ్వంసకారిణే! మనుషులంతా ముక్తకంఠంతో ఖండించాలి. వ్యతిరేకించాలి. మనుషుల్ని కలిపే అంశాలేవో, విభజించే విషయాలేవో అవగాహన చేసుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న అబద్ధాల పట్ల అప్రమత్తమవ్వాలి.
”బుల్లెట్లకు నా తండ్రిని కోల్పోయాను. కానీ కశ్మీరు నాకు ఇద్దరు సోదరులను ఇచ్చింది” అని బాధలోనూ మానవతను గుర్తించిన ఆరతి మాటలు వినండి ”కాశ్మీర్‌లో మా కారు డ్రైవర్‌ ముసఫిర్‌, మరోవ్యక్తి సమీర్‌, నేను క్షేమంగా ఇంటికి చేరుకున్నానంటే వారి సాయంవల్లే. నాన్న మృతదేహం మార్చురీ నుండి ఇక్కడికి తీసుకొచ్చేవరకు అన్నీ వారే చూసుకున్నారు. నాన్న పోయిన బాధని దిగమింగుతున్న నా కళ్లు, వాళ్ల ప్రేమకి వర్షించాయి’ అన్నది. ఆ మాటలు వింటుంటే మనందరి కళ్లూ చెమర్చటం లేదూ! ఛత్తీస్‌గఢ్‌ నుండి కశ్మీరు అందాలను చూసేందుక వెళ్లారు వాళ్లు. ఫొటోలు దిగుతున్నారు. కాల్పుల శబ్దాలు వినిపించాయి. వెంటనే ఆ యాత్రికుల గైడ్‌ నజకత్‌ అహ్మద్‌షా వారి ముగ్గురి పిల్లల్ని తీసుకుని ఒక చిన్నమార్గం గుండి పద్నాలుగు కిలోమీటర్లు పరుగెత్తుకుంటూ వెళ్లి పహల్గాంలో వారిని సురక్షితంగా ఉంచి, తిరిగొచ్చి నాలుగు జంటలను కాపాడాడు. అప్పటికే ఆ ఉగ్రదాడిలో తన మేనమామ కొడుకు ఆదిల్‌ ముష్కరుల తూటాలకు బలయ్యాడని తెలిసింది. అయినా పర్యాటకులు క్షేమంగా తిరిగి వెళ్లేవరకు వారివెంటే ఉండటం బాధ్యతగా భావించి, ఆదిల్‌ అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని నజకల్‌ ఆవేదనతో చెప్పటం వెనుక మానవీయ హృదయం కనపడటం లేదూ! నజకల్‌ను ముస్లింగా, మతస్తుడిగానే చూడగలుగుతామా! ఇక పర్యాటకుల హార్స్‌ రైడర్‌ స్వయంగా పర్యాటకులను కాపాడేందుకు ఉగ్రవాదులతో తలపడి ప్రాణాలొదిలిన అతడిని ముస్లిం అని పేర్కొంటామా? మానవత్వమున్న మనిషిగా గుర్తిస్తామా! ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడిన ఆదిల్‌షా షాజీద్‌ అహ్మద్‌ భట్‌, సాజద్‌నారు ఇంకా ఎందరినో చెప్పాలి. వాళ్లంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలిచిన నిజమైన భారతీయులు. ”మమ్మల్ని కాల్చింది ముస్లింలే కానీ మాకు సహాయం చేసింది కూడా ముస్లింలే. హంతకుల మతాన్ని బట్టి, మతంలో వారందరినీ హంతకులని విద్వేషం ప్రచారం చేయడం తగనిపని” అని దాడికి గురయిన బాధితులు స్వయంగా చెబుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వ అవగాహన ఇది.
శ్రీనగర్‌కు చెందిన డాక్టర్‌ ఇరాన్‌ ఏం చేసాడంటే, అధికధరలు, హైవే మూసివేత కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న పర్యాటకుల కోసం తన ఇంటినే హోటల్‌గా మార్చేశాడు. ఉచిత ఆవాసాన్ని అందించాడు. జెకె01ఎ/ఎల్‌ 6976. ఇది ఆటోనెంబర్‌. దీనిపై ఇలా రాసి ఉంది ”పర్యాటకులకు ఉచిత ఆటో సర్వీసు. ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌కు తీసుకుపోబడును”. ”మా దగ్గరికి అతిథులుగా వచ్చారు. వాళ్లని భద్రంగా పంపడమే మా బాధ్యత తప్ప, సొమ్ము చేసుకోవడం కాదు” అని చెబుతున్న కశ్మీరీలు మతానికి ముస్లింలయినా ఎంత గొప్పమనసు వాళ్లది.మతం వేరు. మతతత్వం వేరు. మతోన్మాద చర్యలూ వేరు. ఇంకా మనం అర్థం చేసుకోవడం లేదు. ఇదే సమయంలో పర్యా టకుల ఆందోళనతో సొంత ఊళ్లకు పరుగెడుతున్న వేళ, శ్రీనగర్‌ నుండి ఢిల్లీకి విమాన టికెట్‌ ధరను రూ.7వేల నుండి 55వేలకు పెంచేశారు మనదేశ భక్త విమానయాన సంస్థలు. ఇప్పుడే కాదు, ఉక్రెయిన్‌ రష్యా యుద్ధ సమయంలో 30వేల టికెట్‌ లక్షా ఇరవై వేలు పెంచింది మన టాటా ఎయిర్‌ ఇండియా. ఆఖరికి కుంభమేళాకు పెంచి దేశభక్తిని చాటుకున్నారు. ఏదిఏమైనా, భద్రతాలోపాల కారణంగా, నిఘా వర్గాల వైఫల్యం మూలంగా, ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను నిర్మూలించలేని అసమర్థత ఫలితంగా ఎన్నో విలువైన ప్రాణాలు సామాన్యులవి బలయ్యాయి.ఈ ఆపద సమయంలోనే కశ్మీరంలో నిజమైన మానవీయ హృదయం వెల్లడయింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు