– ఆకట్టుకున్న హెరిటేజ్ వాక్
– చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్
– పోలీసుల భారీ బందోబస్తు
నవతెలంగాణ – ధూల్ పేట్
మిస్‌వరల్డ్ పోటీల సుందరీమణులు హైదరాబాద్ చారిత్రక ప్రాంతాల్లో సందడి చేశారు. నగరానికి ఐకాన్ అయిన చార్మినార్ వద్ద మంగళవారం హెరిటేజ్ వాక్‌తో వారు అలరించారు. 102 దేశాలకు చెందిన 116 మంది సుందరీమణులు చార్మినార్ అందాలు, చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించారు. ముందుగా చార్మినార్ వద్దకు పర్యాటక బస్సుల్లో చేరుకున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు స్థానిక కళాకా రులు సంప్రదాయ అరబ్బీ మర్ఫా సంగీతంలో స్వాగతం పలికారు. కళాకారులతో కలిసి వారిలో కొందరు ప్రత్యేక స్టెప్పులతో నృత్యం చేశారు. అనంతరం చార్మినార్ వద్ద ఫొటో షూట్‌కు హాజరైన వారు, ఈ చారిత్రాత్మక వేదిక నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చార్మినార్ అందాలను వారి సెల్‌ఫోన్లలో బంధించారు. తర్వాత చార్మినార్ ముందు నిర్వహించిన హెరిటేజ్ వాక్‌తో సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటారు. సందర్శనలో భాగంగా చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ చుడీ బజార్ (లాడ్ బజార్)లో కంటెస్టెంట్స్ గాజులు, ముత్యాల హారాలు, ఇతర అలంకరణ వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం స్థానిక హస్తకళల పట్ల ఆసక్తిని ప్రదర్శించారు. కొందరు కంటెస్టెంట్స్ గాజుల తయారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించి, నిపుణులైన కళాకారులు, శిల్పులను ప్రశంసించారు. ఈ సందర్భంగా లాడ్ బజార్ వ్యాపారులు మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల దగ్గర డబ్బులు తీసుకోలేదు. హైదరాబాద్ విశిష్టతను వారి దేశాల్లో చాటిచెప్పాలని కోరారు.
చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
సుందరీమణులు లాడ్ బజార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్‌కు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన మ్యూజికల్ కాన్సర్ట్‌తోపాటు వెల్‌కమ్ డిన్నర్‌లో వారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పసందైన హైదరాబాదీ వంటకాలతో, రుచికరమైన విందును ఆరగించిన మిస్‌వరల్డ్ పోటీదారులు వంటకాలన్నీ చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. ప్యాలెస్ సందర్శనకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
భారీ బందోబస్తు..
మిస్ వరల్డ్ పోటీదారుల హెరిటేజ్ వాక్ నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాల దారి మళ్లించారు. చిరు వ్యాపారులను కట్టడి చేశారు. నగర సీపీ ఆనంద్ పర్యవేక్షణలో సౌత్ జోన్ డీసీపీ మెహ్రా ప్రత్యేక బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చార్మినార్ నాలుగు వైపులా ఉన్న దారుల్లో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. అణువణువూ తనిఖీ చేసి చార్మినార్ వరకు అనుమతించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక నిఘా, బాంబు స్క్వాడ్లతో పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు.
చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ పోటీదారుల సందడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES