Sunday, July 13, 2025
E-PAPER
Homeకవర్ స్టోరీనిటారుగా నిలబడే ప్రజల భూమి

నిటారుగా నిలబడే ప్రజల భూమి

- Advertisement -

ఈ రెండు తిరుగుబాట్ల మధ్య తేడాను అర్థం చేసుకోవాలంటే, బుర్కినాఫాసో చరిత్రను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. బుర్కినాఫాసో ఒకప్పుడు ఫ్రెంచ్‌ వలసగా ఉండేది. దాన్ని ‘అప్పర్‌ వోల్టా’ అనే పేరుతో పిలిచేవారు. 1960లో స్వాతంత్య్రం పొందిన తర్వాత, 1984లో ‘బుర్కినా ఫాసో’గా పేరుమార్చారు – దీనర్థం ‘నిటారుగా నిలిచే ప్రజల భూమి’ అని అర్థం. ఈ పేరు ప్రజల గౌరవప్రదమైన వారసత్వాన్ని, ఆశయాలను ప్రతిబింబిస్తుంది. అటువంటి దేశ చరిత్రను గురించి ఈ వారం కవర్‌ స్టోరీ…

సంపదపరంగా బుర్కినాఫాసో అపారమైన ఖనిజ నిక్షేపాలను కలిగి ఉంది. బంగారం, జింక్‌, మాంగనీస్‌, ఫాస్ఫేట్‌, సున్నపురాళ్లతో పాటు వజ్రాలు, బాక్సైట్‌, నికెల్‌, వనాడియం నిల్వలున్నాయి. అయినా, అనేక ఆఫ్రికా దేశాల మాదిరిగానే, బుర్కినాఫాసోలో కూడా ఈ సంపద ప్రజల అభివద్ధికి దోహదపడలేదు.
ఈ రోజు అక్కడి జనాభాలో సుమారు 25 శాతం మంది నిష్టదరిద్రులు (రోజుకు 2.15 డాలర్లకన్నా తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు). నిరక్షరాస్యత అధికం. 41 శాతం మంది మహిళలు, 33 శాతం మంది పురుషులకు చదువులేదు. యువతలో 34 శాతం మంది విద్యలో, ఉపాధిలో లేదా శిక్షణలో లేరు. యువతలో నిరుద్యోగం రేటు 52 శాతం. బుర్కినాఫాసో జనాభాలో 66 శాతం 25 ఏళ్ల లోపువారు. సగటు వయస్సు కేవలం 17.7 సంవత్సరాలు. ఇది ఒక గొప్ప సానుకూల అంశం అయినప్పటికీ, స్వాతంత్య్రం అనంతర పాలకుల చేతుల్లో అది వృథా అయింది. ఫ్రెంచ్‌ ఆధిపత్యం స్వాతంత్య్రం తర్వాత కూడా కొనసాగింది.
థామస్‌ సాంకరా – ఆఫ్రికా చె గువేరా
1983లో థామస్‌ సాంకరా తిరుగుబాటు ద్వారా అధికారానికి వచ్చాడు. ఆయన వయస్సు అప్పటికి 33 సంవత్సరాలు మాత్రమే. మార్క్సిస్టు విప్లవవాది. ఆఫ్రికా వ్యాపిత సిద్ధాంతవేత్తగా ప్రసిద్ధి చెందిన సాంకరా, 1983-1987 మధ్య బుర్కినాఫాసో అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన ‘అప్పర్‌ వోల్టా’కు బదులుగా ఆ దేశానికి ‘బుర్కినా ఫాసో’ అనే నూతన నామాన్ని తీసుకువచ్చాడు. సాంకరా తన పాలనలో అవినీతికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడారు. ఫ్రాన్స్‌ ఆధిపత్యం నుంచి దేశాన్ని విముక్తం చేయాలనే సంకల్పంతో పనిచేశారు. విదేశీ సహాయం మీద ఆధారపడకూడదన్న దృఢమైన విధానం కలిగిన ఆయన ఐఎంఎఫ్‌, వరల్డ్‌ బ్యాంక్‌ లాంటి సంస్థల ప్రభావాన్ని వ్యతిరేకించారు. అప్పును ‘ఆఫ్రికాపై మరో పద్ధతిలో సాధించిన ఆక్రమణ’గా అభివర్ణించారు. ఆయన చేపట్టిన ముఖ్యమైన చర్యల్లో భూమి, ఖనిజ సంపద జాతీయీకరణ, రైతులకు భూసంస్కరణల ద్వారా స్వావలంబన కల్పించడం, వృద్ధిపథంలో ఉన్న ఆరోగ్య, విద్యా రంగాల ప్రోత్సాహం ఉన్నాయి.
1983లో ఢిల్లీలో జరిగిన అలీన ఉద్యమ సదస్సులో ఫిడెల్‌ కాస్ట్రో, డేనియల్‌ ఓర్టెగా, యాసర్‌ అరఫాత్‌ లాంటి నాయకులతో భేటీ కావడం ఆయన దృక్కోణాన్ని మరింత శక్తిమంతం చేసింది. అయితే, సామ్రాజ్యవాద శక్తులకు ఆయన విధానాలు నచ్చలేదు. దేశంలో అశాంతిని, సైన్యంలో అసంతృప్తిని రెచ్చగొట్టారు. చివరకు ఒక కుట్రతో ఆయన్ను 1987లో హత్య చేశారు. అనంతరం ఫ్రాన్స్‌-అమెరికా శక్తులు మళ్లీ దేశంపై పట్టు సాధించాయి.
ఇబ్రాహీం ట్రావొరే – నూతన ఆశ
ఈ చరిత్ర నేపథ్యంతోనే ఇబ్రాహీం ట్రావొరే తీసుకుంటున్న విధానాలు విశేష ప్రాముఖ్యతను సంతరించు కుంటున్నాయి. సాంకరా మాదిరిగానే ట్రావొరే కూడా యువ నాయకుడు – వయస్సు 37 సంవత్సరాలు. ఫ్రాన్స్‌ సామ్రాజ్యవాదం నుంచి దేశాన్ని విముక్తి చేయాలనే సంకల్పంతో ఉన్న ఆయన, సాంకరాను స్పష్టంగా తన ఆదర్శంగా ప్రకటించాడు. 2022లో అధికారం చేపట్టిన వెంటనే ఫ్రెంచ్‌ సైన్యాన్ని దేశం నుంచి వెళ్లగొట్టాడు. అంతేకాదు, ఫ్రెంచ్‌ జోక్యాన్ని తీవ్రంగా నిరసిస్తూ రష్యాతో గట్టి మైత్రి ఏర్పరచాలన్న విధానాన్ని ప్రకటించాడు.
ఆర్థికరంగంలో వామపక్ష విధానాలను తెచ్చాడు. జాతీయ యాజమాన్య గనుల సంస్థ ఏర్పాటు చేసి, విదేశీ కంపెనీలు 15 శాతం వాటా తప్పనిసరిగా ఈ సంస్థకు అప్పగించాలని నిబంధన విధించాడు. సాంకేతిక పరిజ్ఞానం దేశీయులకు బదలాయించాల్సిన విధానం ప్రవేశపెట్టాడు. ఇటీవలే లండన్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్టయిన రెండు బంగారు గనులను జాతీయీకరించాడు. ముడిసరుకు రూపంలో బంగారం ఎగుమతి చేయడం కాకుండా, దేశంలోనే శుద్ధి చేసి తుది ఉత్పత్తులుగా మార్చే విధానాన్ని ప్రారంభించాడు. మొదటిసారిగా బుర్కినాఫాసో జాతీయ బంగారు నిల్వలు ఏర్పాటు చేసింది.
వ్యవసాయం – భవిష్యత్తుకు బలం
వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ.. రైతులకు ట్రాక్టర్లు, మోటార్‌ పంపులు, పరికరాల పంపిణీ జరిగింది. పత్తి, తృణధాన్యాలు, టమాటా వంటి పంటల ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి కనిపించింది. ఇది వ్యవసాయ సంబంధిత పరిశ్రమలకు గొప్ప తోడ్పాటునందించింది. ఫలితంగా నిరుద్యోగం తగ్గింది. విద్యారంగం అభివృద్ధి బాట పట్టింది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది.
అంతర్జాతీయ గుర్తింపు
ఈ అభివృద్ధిని ఐఎంఎఫ్‌ కూడా గుర్తించక తప్పలేదు. 2025 నాటికి బుర్కినాఫాసో ఆర్థిక వ్యవస్థ బలంగా నిలుస్తుందని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయం పెంచటం, ఖర్చులను నియంత్రించడం, ఆరోగ్యం, విద్య, సంక్షేమ రంగాల్లో ఖర్చులు పెంచటం మెచ్చుకోదగిన విషయాలుగా ఐఎంఎఫ్‌ పేర్కొంది. వరల్డ్‌ బ్యాంక్‌ సైతం వ్యవసాయ, సేవా రంగాల్లో వృద్ధి వల్ల పేదరికం రెండు శాతం తగ్గిందని తెలిపింది.
సహెల్‌ దేశాల మైత్రి –
సామ్రాజ్యవాదానికి గట్టి సమాధానం

ట్రావొరే తీసుకున్న మరో కీలక నిర్ణయం – మాలి, నైజర్‌ దేశాలతో కలిసి ECOWAS (ఆర్ధిక సహకార బ్లాక్‌) నుంచి వైదొలగటం. ఫ్రాన్స్‌ సైన్యాన్ని వెనక్కి పంపడం. ఈ మూడు దేశాలు కలిసి ‘సహెల్‌ దేశాల మైత్రి కూటమి’ ఏర్పరిచాయి. తమ దేశాల్లోకి దిగుమతయ్యే వస్తువులపై 0.5 శాతం టారిఫ్‌ విధించాయి. ”ఈ ఖండం శతాబ్దాలుగా సామ్రాజ్యవాద మంటల్లో కాలిపోతోంది. వారి దృష్టిలో ఆఫ్రికా బానిసల ఖండమే. ఆ బంధనాలను తెంచుకోకపోతే స్వతంత్ర భవిష్యత్తును నిర్మించలేం” అని ట్రావొరే స్పష్టం చేశారు.
సామ్రాజ్యవాదానికి గట్టి సమాధానం
బుర్కినాఫాసోను స్వతంత్రమైన, అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారుస్తున్న ప్రస్తుత పరిణామాలు సామ్రాజ్యవాద శక్తులను కుదిపేశాయి. 2024 నవంబరులో విఫలమైన కుట్ర తరువాత, 2025 ఏప్రిల్‌ 22న మళ్లీ అధ్యక్షుడు ట్రావొరే ప్రభుత్వంపై కుట్ర యత్నం జరిగింది. ఈ కుట్రల వెనుక అమెరికా పాత్రపై పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కుట్ర విఫలమైన వెంటనే బుర్కినాఫాసో ప్రజలు భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి తమ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. లండన్‌ సహా పశ్చిమ దేశాల్లో సైతం సంఘీభావ ప్రదర్శనలు జరిగాయి. కెన్యాలోని కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ (CPMK) ఈ కుట్రను ఖండిస్తూ.. ”ఇది కిరాతక సామ్రాజ్యవాద దాడి, ఇది మళ్లీ సాంకరా చెప్పిందే నిజమని నిరూపిస్తోంది – సామ్రాజ్యవాదం ఓ చెడు విద్యార్థి. ఇది ఎన్నిసార్లు ఓడినా గుణపాఠం నేర్చుకోదు. అది తిరిగితిరిగి అదే అరిగిపోయిన కుతంత్రాలనే ఉపయోగిస్తూ ప్రజా ప్రభుత్వాలను కూలదోసేందుకు ప్రయత్నిస్తోంది” అని పేర్కొంది. ప్రజలను అంటిపెట్టుకునే కమ్యూనిస్టు పార్టీ ఉండాలని, మేం సామ్రాజ్యవాదాన్ని, నయా వలస శక్తులను ఓడించి స్వేచ్ఛగా, గౌరవప్రదమైన ఆఫ్రికాను నిర్మిస్తామని చెప్పింది. అందుకు ఆఫ్రికా అంతటా, ప్రపంచంలోని న్యాయపరమైన శక్తులంతా బుర్కినాఫాసో ప్రజలు, సాహెల్‌ దేశాల సంకల్పంతో ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చింది.
South African Communist Party (SACP) కూడా ఈ కుట్రను ఖండిస్తూ – ”సెనెగల్‌, బుర్కినా ఫాసో, నైజర్‌, మాలీ దేశాలు చేపడుతున్న చర్యలు బహుళ మార్పులకు మార్గం వేస్తున్నాయి. ఇవి ఆఫ్రికాలో విస్తరిస్తున్న విప్లవభావనలకు ప్రతీకలు. ఈ పరిణామాలకు మద్దతు తెలపడం, వీటిని రక్షించడం అన్నివైపులా వున్న విప్లవకారులకు అత్యవసరమైన బాధ్యత” అని చెప్పింది. ఇది సామ్రాజ్య వాదానికి ఎదురు నిలిచే నూతన రాజకీయ సామర్థ్యానికి, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే పాలనా యత్నాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నదని ప్రకటించింది.
అధ్యక్షుడు ట్రావొరే, ఈ విస్తృత మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ‘సామరస్యంతో, ఐక్యతతో, మనం సామ్రాజ్యవాదాన్ని ఓడిస్తాం. ఇది ఆఫ్రికా గౌరవంతో జీవించే దిశగా దారులు వేస్తుంది.” అని పేర్కొన్నారు. ”సామ్రాజ్యవాద దేశాల ఆజ్ఞలకి బానిసలా ఉండకూడదు, బంధనాలు తెంచుకోవాలి!” అని పిలుపునిచ్చారు. ఈ మాటలను బుర్కినాఫాసో ప్రధాని రిమ్తాల్బా జీన్‌ ఎమా న్యూయెల్‌ కూడా పునరుద్ఘాటిస్తూ.. ”సామ్రాజ్యవాదం యొక్క ఈ బొడ్డుతాడును కత్తిరించడానికి మంత్రసాని సున్నిత చేతులు చాలవు, గొడ్డలి కావాలి” అన్నాడు.
గాజాలో ఇజ్రాయిల్‌ సామ్రాజ్యవాద దాడులవల్ల జరుగుతున్న మారణహోమాన్ని ప్రపంచం చూస్తోంది. క్యూబాను ముట్టడించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలను అమెరికా ఎలా నాశనం చేయాలని చూస్తోందో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గం ఒక్కటే- ”సామ్రాజ్యవాద బంధనాలను తెంచుకోవాలి”. బుర్కినాఫాసో అదే మార్గాన్ని ఎంచుకుంది. అదే మార్గం ఇప్పుడు ప్రపంచ ప్రజలకు ఆశాకిరణంగా నిలుస్తోంది.
– ఆర్‌.అరుణ్‌కుమార్‌
అనువాదం:రాంపల్లి రమేష్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -