– ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వైవాహిక బంధంలో అఘాయిత్యమనే భావననే చట్టం గుర్తించదని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు, తన భార్యతో అసహజ శృంగారం జరిపిన భర్తపై నమోదైన కేసును కొట్టివేసింది. ఐపీసీ సెక్షన్ 377ను వైవాహిక బంధంలో ముఖ్యంగా భాగస్వామి అంగీకారం లోపించిందనే ఆరోపణలు వున్నపుడు వర్తింప చేయలేమని పేర్కొంది. భార్యతో అసహజ శృంగారం నెరిపినందుకు సెక్షన్ 377 కింద ఆ భర్తపై అభియోగాలు మోపాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. దానిపై ఆ వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ పై వ్యాఖ్యలు చేసి కేసును కొట్టివేశారు. తన ఇష్టానికి వ్యతిరేకంగా లేదా తన ఆమోదం లేకుండానే ఈ చర్య జరిపారని భార్య ప్రత్యేకంగా ఆరోపించలేదని హైకోర్టు పేర్కొంది. ఏ స్త్రీ, పురుషుల మధ్యనైనా తప్పనిసరిగా వుండాల్సిన సమ్మతి అనే కీలకమైన అంశం ఇక్కడ ప్రస్తావించబడనందున, ప్రాధమిక సాక్ష్యాధారం లేనట్లుగా భావించాల్సి వుంటుందని పేర్కొంది. పైగా భార్య చేసిన ప్రకటనలు పరస్పర విరుద్ధంగా వున్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అందువల్ల భర్తపై కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది.
అఘాయిత్యమనే భావనను చట్టం గుర్తించదు!
- Advertisement -
- Advertisement -