Saturday, May 17, 2025
Homeరాష్ట్రీయంకనీస వేతనం రూ.26 వేలివ్వాలి

కనీస వేతనం రూ.26 వేలివ్వాలి

- Advertisement -

– లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి
– వైద్యారోగ్యం, వ్యవసాయ రంగాలకు నిధులు కేటాయించాలి
– సార్వత్రిక సమ్మె నోటీసుల అందజేతలో సీఐటీయూ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దేశంలోని కార్పొరేట్లపై పన్నులు పెంచి పేదలకు కీలకమైన వైద్యారోగ్యం, వ్యవసాయ రంగాలకు ఆ నిధులను కేటాయించాలని సీఐటీయూ అనుబంధ సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలనీ, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆయా రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ, ఈ నెల 20న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఐటీయూ నేతలు సమ్మె నోటీసులను సోమవారం అందజేశారు.
టెక్ట్స్‌ బుక్‌ ముద్రణాలయంలో…
తెలంగాణ ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాలయంలో ఉన్నతాధికారులకు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, తెలంగాణ ప్రభుత్వం టెక్ట్స్‌బుక్‌ ప్రెస్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు ఎం.వెంకటేశ్‌, ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఈశ్వరయ్య సమ్మె నోటీసు అందజేశారు. విద్యుత్‌ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలనీ, పెట్రోల్‌, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించాలనీ, నిత్యావసర వస్తులను తక్కువ ధరలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. పాతపెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డ ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలనీ, 51 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలనీ, పీఆర్సీని అమలు చేయాలని విన్నవించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ పెట్టిన 52 డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
తెలంగాణ బీడీ, సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో
తెలంగాణ బీడీ, సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కమిషనర్‌కు సమ్మె నోటీసును పంపారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.గోపాలస్వామి, ఎస్వీ.రమ ఒక ప్రకటన విడుదల చేశారు. బీడీ కార్మికులకు 1000 బీడీలకు గానూ రూ.807 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నెలకు 26 రోజుల పని కల్పించాలని విన్నవించారు. బీడీ ప్యాకర్స్‌, సార్టర్‌, ట్రైపిల్లర్‌, నెల వేతనాలు పొందే కార్మికులకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని కోరారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌, బోనస్‌ చట్టాలని విధిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. నెలకు సరిపడా నాణ్యమైన ఆకు, తంబాకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
సెర్ప్‌ సీఈఓకు సమ్మె నోటీసు
సెర్ప్‌ సీఈఓకు తెలంగాణ మెప్మా రీసోర్స్‌పర్సన్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు పంపారు. ఈ మేరకు ఆ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్వీ.రమ, డి.శ్రీరేవతి ప్రకటన విడుదల చేశారు. ఆర్‌పీలకు జీవో నెంబర్‌ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. నేరుగా వారి ఖాతాల్లోనే వేతనాలు జమచేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌పీలకు ఒకే రకమైన డ్రస్‌ కోడ్‌ ఇవ్వాలనీ, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నవించారు. తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలోనూ సెర్ప్‌ సీఈఓకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజ్‌కుమార్‌, ఎస్వీ.రమ, కోశాధికారి సుమలత సమ్మె నోటీసు అందజేశారు. స్త్రీనిధి ప్రోత్సహకాలను గ్రామ సంఘాలకు ఇవ్వాలనీ, వీఓఏలకు గ్రామ సంఘం నుంచి రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలనీ, మూడు నెలలకోసారి వీఓఏ రెన్యూవల్‌ పద్ధతిని తీసేయాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హామీ ప్రకారం రూ.20 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రూ.20 లక్షల సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా వీఓఏలకు గౌరవ వేతనాలివ్వాలని విన్నవించారు.
తెలంగాణ గ్రామీణ ఉపాధి ఫీల్డు అసిస్టెంట్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు తెలంగాణ గ్రామీణ ఉపాధి ఫీల్డు అసిస్టెంట్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపాల్‌, ఎం.నారాయణగౌడ్‌ సమ్మె నోటీసు పంపారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచలని డిమాండ్‌ చేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లకు సంబంధించిన సర్క్యూలర్‌ 4779 ఎత్తేసి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, వారికి పేస్కేలు వర్తింపజేయాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులకు నరేగా నుంచి ఇచ్చే రూ.8 వేల అలవెన్స్‌లను ఫీల్డు అసిస్టెంట్లకు వర్తింపజేయాలని విన్నవించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -