– అండమాన్, బంగాళాఖాతంలో ప్రవేశం
– మూడు నాలుగు రోజులలో విస్తరణ
– 27న కేరళకు..
– ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతమే
న్యూఢిల్లీ: మండు వేసవిలో చల్లని వార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు మంగళవారం దేశంలో ప్రవేశించాయి. బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ‘నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలలో ప్రవేశించాయి’ అని ఓ ప్రకటనలో తెలిపింది. రాబోయే మూడు నాలుగు రోజులలో రుతుపవనాలు మరింతగా విస్తరిస్తాయని చెప్పింది. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులుాకొమోరిన్ ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో రాబోయే మూడు నాలుగు రోజులలో రుతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ వివరించింది. రుతుపవనాల కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.
అనుకూలిస్తున్న పరిస్థితులు
ఉత్తర భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే అధికంగా నమోదవుతున్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజరు మహాపాత్ర తెలిపారు. దిగువ వాతావరణ స్థాయిలలో పశ్చిమ గాలులు బలంగా ఉండడం, ఎగువ వాతావరణ స్థాయిలలో తూర్పు గాలులు బలంగా ఉండడం, దక్షిణ ద్వీపకల్పంలో 40 రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షపాతం నమోదు కావడం, వాయవ్య పసిఫిక్ మహా సముద్రంలో సాధారణం కంటే ఎక్కువ పీడనం ఉండడం….ఇవన్నీ రుతుపవనాలు ముందుగానే వచ్చాయని సూచించాయని ఆయన వివరించారు. రుతుపవనాల ప్రారంభానికి అనుకూలంగా ఉన్న సముద్ర, వాతావరణ పరిస్థితులను ఆయన వివరిస్తూ ‘కేరళను రుతుపవనాలు ముందుగానే తాకబోతున్నాయని ఇవన్నీ సంకేతాలు ఇస్తున్నాయి. ప్రస్తుత గాలి పరిస్థితులు రుతుపవనాలు బలంగా ఉన్నాయన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి. జూన్ 1వ తేదీకి ముందే కేరళలో భారీ వర్షపాతం నమోదవుతుందని మన వాతావరణ సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా చెబుతున్నాయి’ అని అన్నారు.
కేరళలో ముందుగానే ప్రవేశం
సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకుతాయి. కానీ ఈసారి ఐదు రోజుల ముందుగానే…అంటే ఈ నెల 27నే ఆ రాష్ట్రంలో ప్రవేశిస్తాయని ఐఎండీ చెబుతోంది. 2019లో మే 18న, 2020లో మే 17న, 2021లో మే 21న, 2022లో మే 16న, 2023లో మే 19న, 2024లో మే 19న ఈశాన్య రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో ప్రవేశించాయి.
ఏడేండ్లలో తొలిసారిగా…
గత ఏడు సంవత్సరాల కాలంలో తొలిసారిగా ఆయా ప్రాంతాలలో ముందుగానే రుతుపవనాలు ప్రవేశించడం గమనార్హం. తొలుత ఐఎండీ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ నెల 19న, అండమాన్‌ానికోబార్ దీవులలోని పోర్ట్‌బ్లెయిర్‌లో ఈ నెల 21న రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. అయితే నికోబార్ దీవులలో సోమవారం నుండే ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాల ప్రవేశానికి ఇది సంకేతం. దేశంలో వర్షాలు బాగా కురిసేది నైరుతి రుతుపవనాల కాలంలోనే. జూన్‌ాసెప్టెంబర్ మధ్య కాలంలోనే 70 శాతానికి పైగా వర్షపాతం నమోదవుతుంది. నైరుతి రుతుపవనాలు ప్రతి సంవత్సరం తొలుత అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలో ప్రవేశించి అనంతరం ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తాయి.
రుతుపవనాలు వచ్చేశాయ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES