Saturday, May 24, 2025
Homeజాతీయంనెల గడిచినా…

నెల గడిచినా…

- Advertisement -

– ఇప్పటికీ అంతుచిక్కని పహల్గాం ఉగ్రవాదుల జాడ
– కాశ్మీర్‌లో భద్రతపై అనేక ప్రశ్నలు

– పర్యాటకం కుదేలు..
– వెలవెలబోతున్న ఘటనా ప్రాంతం
– ప్రజల ఉపాధిపై తీవ్ర ప్రభావం

– దెబ్బతిన్న స్థానిక ఆర్థికవ్యవస్థ
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి జరిగి నెల గడిచింది. గతనెల 22న అమయాకపు పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయిన విషయం విదితమే. పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ ఉగ్రవాదులు జరిపిన ఈ దారుణ ఘటన దేశాన్ని తీవ్రంగా కలవరపర్చింది. అంతర్జాతీయంగా అనేక దేశాలూ ఈ దాడిని ఖండించాయి. ఈ ఘటన తర్వాత భారత్‌, పాక్‌ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు అణుసామర్థ్య దేశాల మధ్య యుద్ధవాతావరణమే నెలకొన్నది. నెల గడిచినా.. ఇప్పటికీ ఉగ్రవాదుల జాడ లేదు. ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌పై భారత్‌ పైచేయి సాధించినా… జమ్మూకాశ్మీర్‌లో భద్రత పట్ల ఇప్పటికీ అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జమ్మూకాశ్మీర్‌కు ముఖ్యమైన ఆదాయ వనరు పర్యాటక రంగమే. అయితే, పహల్గాం ఘటనతో ఆ రంగం కుదేలైంది. స్థానిక ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నది. ఉగ్రవాదుల జాడ తెలియకపోవటమూ ఆందోళన కలిగిస్తున్నది. సదరు నిందితులు అధునాతన ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని కలిగి ఉండి ఎగువ తులియన్‌ లోయలోని దట్టమైన అటవీ ప్రాంతంలో దాక్కుని ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. పర్యాటకులపై ముష్కరుల పాశవిక చర్య తర్వాత ఘటన చోటు చేసుకున్న బైసారన్‌ గడ్డి మైదానం వెలవెలబోతున్నది. పర్యాటకం పైనే ఆధారపడి జీవిస్తున్న వందలాది మంది స్థానికులు ఉపాధిని కోల్పోయారు. ఇక్కడకు వచ్చే వేలాది మంది పర్యాటకులతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉండేదనీ, అయితే, ప్రస్తుత పరిస్థితి తమను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నదని దుకాణాదారులు, చిరువ్యాపారులు, పోనీవాలాలు, క్యాబ్‌డ్రైవర్లు, హోటల్‌ సిబ్బంది.. ఇలా పర్యాటకంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవించేవారు వాపోతున్నారు. నెల రోజులుగా తాము ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనీ, ప్రభుత్వమే ఏదో ఒకటి చేసి తమను ఆదుకోవాలని వారు చెప్తున్నారు.
పుల్వామా తర్వాత జరిగిన పెద్ద ఉగ్రదాడి పహల్గాం అయినా.. ఇందులో పౌరులను లక్ష్యంగా చేసుకోవటం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. అయితే, ఈ ఉగ్ర ఘటన ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌లోని పరిస్థితులపై ఆలోచింప జేస్తున్నది. ఆర్టికల్‌ 370 రద్దుతో ఇక్కడి శాంతి నెలకొన్నదనీ, ఉగ్రవాదం తగ్గిందనీ, పర్యాటక రంగం ఊపందుకున్నదని కేంద్రంలోని మోడీ సర్కారు చేస్తున్న వాదనలకు.. పహల్గాందాడి ఘటన సవాలుగా మారిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. ఈ కేంద్ర సంస్థ 300 మందికి పైగా స్థానికులను ప్రశ్నించింది. ఇందులో దుకాణదారులు, గుర్రపు గైడ్‌లు, ఫోటోగ్రాఫర్లు, జిప్‌లైన్‌ ఆపరేటర్లు, దాడిని చూసినవారు ఉన్నారు. ఉగ్రవాదుల ముఖచిత్రాలనూ దర్యాప్తు సంస్థ విడుదల చేసింది. రూ.20 లక్షల బహుమతిని కూడా ప్రకటించింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌ను కేంద్రంలోని మోడీ సర్కారు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చీల్చింది. ఇటీవలే జమ్మూకాశ్మీర్‌కు ఎన్నికలు కూడా జరిగాయి. అయినప్పటికీ.. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో శాంతి భద్రతల వ్యవస్థ కేంద్రం చేతిలో ఉంటాయి. కాబట్టి, శాంతి భద్రతలను పరిరక్షించటంలో కేంద్రం విఫలమైందన్న విషయం పహల్గాం ఘటనతో స్పష్టమవుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విషయంలో మోడీ సర్కారు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి, చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్న విషయం విదితమే. అయినప్పటికీ.. ఈ విషయం లో మోడీ సర్కారు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -