నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ కేసులో మిస్టరీ వీడింది. ఐటీ ఉద్యోగిని విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి డిప్రెషనే ప్రధాన కారణమని పోలీసులు 9 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం నిర్ధారించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… విజయశాంతి తన ఇంటర్ చదువుతున్న పిల్లలు చేతనా రెడ్డి, విశాల్ రెడ్డిలను పూర్తిగా తన అదుపులో పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాను చనిపోతే పిల్లలు ఒంటరైపోతారనే తీవ్ర ఆందోళనతోనే వారిని కూడా ఆత్మహత్యకు ఒప్పించి ఈ దారుణానికి పాల్పడ్డారని విచారణలో తేలింది.
ఉప్పల్‌కు చెందిన విజయశాంతి, దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న సురేందర్ రెడ్డి దంపతులు. గత నెల 30న రాత్రి, హాస్టల్‌లో ఉన్న పిల్లలను తన కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ కారు పార్కింగ్ స్లిప్‌పై ‘ఇక బతకాలని లేదు’ అని సూసైడ్ నోట్ రాసి, ముగ్గురూ కలిసి గూడ్స్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ కేసును సవాల్‌గా స్వీకరించిన పోలీసులు.. ఆమె భర్త, తల్లి, సోదరుడితో పాటు సహోద్యోగుల వాంగ్మూలాలు తీసుకున్నారు. ల్యాప్‌టాప్, వాట్సాప్ చాట్, కాల్ హిస్టరీని విశ్లేషించారు. ఎలాంటి ఆర్థిక, కుటుంబ సమస్యలు లేనప్పటికీ, తీవ్రమైన డిప్రెషన్‌తోనే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తేల్చారు. అయితే, ఆమె అంతలా డిప్రెషన్‌కు గురికావడానికి దారితీసిన కచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.



